మిర్చి పంటను ప్రభుత్వమే కొనాలి
కణేకల్లు : మిర్చి పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.1500 ప్రకారం పరిహారం కింద కంటితుడుపుగా భిక్షమేసి రైతులను మభ్యపెట్టడం శోచనీయమన్నారు. కణేకల్లులో శనివారం గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది రైతులు మిర్చి పంట సాగు చేసి గిట్టుబాటు ధరలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్నకాటికి అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కెట్లో మంచి ధర వస్తోందనే ఆశతో ఇంకా చాలా మంది రైతులు గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నారని ప్రభుత్వమే మిర్చి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోÆýరారు. తక్కువ ధరలకు పంట ఉత్పత్తులను అమ్మేసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, వైఎస్సార్సీపీ నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, కె.విక్రంసింహారెడ్డి, టీ.కేశవరెడ్డి, మక్బూల్, అజ్ముతుల్లా గంగలాపురం మృత్యుంజయ్య తదితరులు పాల్గొన్నారు.
గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయండి
రాయదుర్గం రూరల్ : కరువు కాటకాలతో రైతులు సతమతమవుతూ పశువుల్ని పోషించలేక కబేళాలకు విక్రయిస్తున్నారని, పశు సంపదను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఆయతపల్లిలో తిప్పేస్వామి గృహంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
ఉచితంగా రైతులకు గడ్డి కొనుగోలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పశుసంపద కబేళాలకు తరలిపోకుండా కాపాడాలన్నారు. కర్ణాటకలో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్ధేశంతో అక్కడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో దొరికే గడ్డిని కొనుగోలు చేసి పశువులను కాపాడుతోందని గుర్తు చేశారు. మరి టీడీపీ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవడంలో చిత్తశుద్ధి కరువైందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మాజీ ఎంపీపీ ఆలేరు రాజగోపాల్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, యువజన నాయకులు నాగిరెడ్డి, కాంతారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.