పోలీసుల పోరుబాట
⇒ నేడు సచివాలయం ముట్టడి
⇒ 27 నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, చెన్నై : పలు డిమాండ్లపై పోరుబాట పట్టిన పోలీసులు తమ కోర్కెల సాధనకు మరో ముందడుగు వేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో గురువారం సచివాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులు ఉండగా, వారికి వేతనాల పెంపు, ఎనిమిది గంటల పని, సంక్షేమ సంఘం, క్వార్టర్ల సదుపాయం తదితర కోర్కెలను కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ముందుంచారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలని ప్రతిఏటా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా, గత నెల 22వ తేదీన చెన్నై పరంగిమలైలోని సహాయక కమిషనర్ కార్యాలయం, దాని పరిసరాల్లో ‘దయనీయంగా తమిళనాడు పోలీస్‌శాఖ’ అనే పేరుతో పోలీసు సంఘం తదితర ఎనిమిది డిమాండ్లతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. క్రమేణా రాష్ట్రం నలుమూలలా ఈ పోస్టర్లు విస్తరించాయి. ఈ పోస్టర్ల యుద్ధంపై కంగారుపడిన పోలీసు ఉన్నతాధికారులు వీటి వెనుకున్న వారెవరని ఆరాతీయడం మొదలుపెట్టారు. పోలీసులవి న్యాయపరమైన కోర్కెలంటూ పోలీసుశాఖలోని కొందరు పరోక్షంగా మద్దతు పలికారు. ఈ దశలో డీజీపీ రాజేంద్రన్ అన్ని జిల్లాల ఎస్పీలకు అత్యవసర సర్క్యులర్ పంపారు.
సంఘం ఏర్పాటు, పోస్టర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడేవారెవరో కనుగొని తగిన చర్య తీసుకోవాలనేది ఆ సర్క్యులర్ సారాంశం. సుమారు 75 మందిని అనుమానించి విచారించారు. అలాగే, పోలీసుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఒక ఈమెయిల్‌ను ప్రకటించారు. అయితే పోలీసుల కోర్కెలను నెరవేర్చేందుకు ఏ ఉన్నతాధికారీ ముందుకు రాలేదు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశంలో పోలీస్‌శాఖపై చర్చ జరుగనుండగా, తమ కోర్కెల సాధనకు మెరీనాబీచ్ నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని, సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు.
అయితే ఈ ర్యాలీని అణచివేసేందుకు ఉన్నతాధికారులు మరో సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా గత రెండు రోజులుగా పోలీసులకు చేరవేస్తున్నారు. అందులో.. ‘తమిళనాడు పోలీసు శాఖలో బానిసత్వాన్ని రూపుమాపి సంపూర్ణ స్వాతంత్య్ర దినంగా ఈనెల 6వ తేదీ నిలువనుంది, పోలీసులెవరూ సచివాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనరాదు’ అనే హెచ్చరికలతో కూడిన సందేశాన్ని పంపుతున్నారు. ఉన్నతాధికారులపై భయంతో ఒకవేళ పోలీసులు వెనక్కుతగ్గినా వారి కుటుంబ సభ్యులు కదలివచ్చి ర్యాలీ నిర్వహణ, సీఎంకు వినతిపత్రం తదితర అందోళన కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు మెరీనాబీచ్ వద్ద అందరూ సమూహంగా ఏర్పడి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. దీంతో మెరీనా తీరంలో వేలాదిమంది పోలీసులు రెండు రోజులుగా పహారా కాస్తున్నారు.
27న ప్రభుత్వ ఉద్యోగుల ర్యాలీ
ఎనిమిదో వేతన సవరణల సిఫార్సుల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు. ఈనెల 27వ తేదీన జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నా, వచ్చేనెల 11వ తేదీన లక్ష మంది ఉద్యోగులతో చెన్నై ప్రభుత్వ అతిథిగృహం నుంచి సచివాలయం వరకు ర్యాలీ జరపాలని తీర్మానించారు.