నాడేపు కంపోస్టు నిర్మాణాలపై నిర్లక్ష్యం
బేల, న్యూస్‌లైన్ : వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సహజ ఎరువుల వినియోగాన్ని పెంచడానికీ ప్రభుత్వం ఉపాధిహమీ పథకంలో మంజూరు చేస్తున్న నాడేపు కంపోస్టు నిర్మాణాలపై నిర్లక్ష్యమే కొనసాగుతోంది. ఇవి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు(బీసీ) అర్హులైన రైతులకు మాత్రమే మంజూరు చేస్తారు. వీటితో సహజ ఎరువుల తయారీతో, వ్యవసాయంలో ఖర్చుల తగ్గుదలతో నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.
దీని కోసం మొత్తంగా అంచనా విలువ నిధులు రూ.15,262 ఉంటాయి. ఇందులో ఇటుకలు, కంకర, ఇసుక, ఇతర సామగ్రి కోసం రూ.6వేల వరకు కేటాయింపు ఉండగా, మిగతా 52 పని దినాలకు కూలి(3 ఏళ్లకు) కోసం నగదు చెల్లింపు ఉంటుంది. ఈ పనిదినాల కేటాయింపు రోజులు ఇలా.. బెడ్ కోసం 1, పైకప్పు కోసం 6, మరో 5రోజులు వర్మీ కంపోస్టు ఎరువు తయారీ(ఏడాదికి 3 సార్లు చొప్పున) కేటాయింపు ఉంటుంది. ఇందులో గోడ నిర్మాణం మినహాయించి, మిగతా సదరు రైతు గానీ, ఇతర కూలీలలతో పని చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
మండలంలోని సిర్సన్న, సాంగిడి గ్రామాల్లోనే ఈ నిర్మాణాలు ఆగస్టులో ప్రారంభం కాగా, ఇప్పటికీ 16 పూర్తయినట్లు తెలిసింది. వీటన్నింటికీ డ్వామా అధికారుల నిర్లక్ష్యంతో, పూర్తిస్థాయిలో నగదు చెల్లింపులు ఇప్పటికీ జరుగలేదు. దీంతో ఈ నిర్మాణాలు చేయించడంలో టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదాసీనత చూపినట్లు తెలిసింది. తద్వారా రైతులు సైతం ఆసక్తి చూపకపోవడంతో, నాడేపు కంపోస్టు నిర్మాణాలపై తీవ్ర నిర్లక్ష్యమే ఉన్నదని తెలుస్తోంది. దీంతో మిగతా గ్రామాల్లో ఈ నిర్మాణాలపై రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది.
నాడేపు కంపోస్టు నిర్మాణం ఇలా..
నాడేపు కంపోస్టు నిర్మాణాన్ని సదరు రైతు వ్యవసాయ చేస్తున్న చేను శివారులో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ముందుగా 3 మీటర్ల పొడవు, 1.80 మీటర్ల వెడల్పుతో భూమిలో 6 ఇంచుల లోతును తవ్వి, సీసీ బెడ్ వేయాల్సి ఉంటుంది. దీనిపై 0.9 మీటర్ల(3 అడుగులు) ఇటుకతో రంధ్రాల గోడ నిర్మాణం(గాలి ప్రసారం కోసం) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గోడపై తాత్కాలిక పైకప్పు(తీసేటట్టు వీలుగా) నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది.
సహజ ఎరువుల తయారీ ఇలా..
ఈ నాడేపు కంపోస్టు నిర్మాణంలో ఏడాదికి 3 సా ర్లు సహజ ఎరువులు తయారు చేయాల్సి ఉం టుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత పశువుల పేడ, ఆకులు, చేన్లలో వ్యవసాయ వృథాను ఒక అడుగు మేర వేయాలి. తర్వాత ఇదంతా తడిసేటట్లు సరిపడా మోతాదులో నీళ్లు చల్లాలి. ఇదివరకే చేపట్టిన ప్రక్రియను మరో 2 సార్లు చేపడితే, నాడేపు కంపోస్టు నిర్మాణం పూర్తిగా నిండిపోతుంది. దీనిపై పైకప్పు వేసుకున్నట్లయితే, అప్పటికే నిర్మించి ఉన్న రంధ్రాల గోడ ద్వారా గాలి ప్రసారంతో సహజ ఎరువు తయారీ అవుతుంది.
ఇంతే కాకుండా.. ఇప్పటికే పశువుల పే డ, ఆకులు, చేన్లలో వ్యవసాయ వృథాతో నిండి ఉన్న దానిపై వానపాములు వేసి, పైకప్పు వేసుకున్నట్లయితే కొన్ని రోజులకే ఁవర్మీ కంపోస్టు* సైతం తయారీ అవుతుంది. ఇలా తయారైన సహజ సిద్ధమైన ఎరువులను చేన్లలో వేసుకుంటే, రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు. సహజ ఎరువుల్లోని పోషకాలతో సారవంతమైన నేల తయారీ, పంట ఎదుగుదల ఉండి, నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. తద్వారా వ్యవసాయ పనుల్లో రైతులకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఈ విషయమై ఈజీఎస్ ఏపీవో సంగీతను ‘న్యూస్‌లైన్’ ఫోన్లో వివరణ కోరగా.. సిర్సన్న లో మూడింటివీ, సాంగిడిలో కొన్నింటివీ చెల్లిం పులు యాక్సిస్ బ్యాంకు బయోమెట్రిక్ విధానం తో నిలిచాయని తెలిపారు. ఇదీ త్వరలోనే పరి ష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.