ఇండో పాక్ సిరీస్‌కు సర్కారు ఓకే!
ఇరు దేశాలు ఎప్పుడు ఎక్కడ తలపడినా అది సంచలనమే. ఏ స్థాయి మ్యాచ్ అయినా అది అట్టహాసంగా జరగాల్సిందే. అభిమానుల మధ్య దాదాపు యుద్ధవాతావరణమే నెలకొంటుంది. సోషల్ మీడియాలో కూడా అది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అదే.. ఇండో- పాక్ క్రికెట్ మ్యాచ్. అవును.. ఈ రెండు దాయాది దేశాల మధ్య త్వరలోనే మరో సిరీస్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2008లో ముంబై దాడుల నేపథ్యంలో నిలిచిపోయిన ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ పునరుద్ధరణకు భారత, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు దాదాపు ఓ అంగీకారానికి వచ్చాయి. దీనికి భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది కూడా. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నవంబర్, డిసెంబర్లో అబుదాబిలో ఈ సిరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
సర్వసాధారణంగానే భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ పోటీ ఉందంటే.. అది మ్యాచ్ కాదు, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోందా అన్నంతగా భావోద్వేగాలు చెలరేగుతాయి. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ పోటీలలో మొట్టమొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనే మనవాళ్లు పాక్‌ను చిత్తుగా ఓడించినప్పుడు కప్ రాకపోయినా పర్వాలేదు.. పాక్ మీద నెగ్గాం చాలని అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అసలు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, లష్కరే తాయిబా నాయకుడు లఖ్వీకి బెయిల్ ఇచ్చి స్వేచ్ఛగా తమ దేశంలో తిరగనిస్తోందని, అందువల్ల వాళ్లను మనతో క్రికెట్ ఆడనివ్వొద్దని కూడా కొంతమంది ఎంపీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే.. రెండు దేశాల్లో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఉద్రిక్తతలు తారస్థాయికి వెళ్తాయనే ఉద్దేశంతో తటస్థ వేదికను ఎంచుకుని అక్కడే సిరీస్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.