‘అతిథి’కి అవమానం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రభుత్వ అతిథిగృహం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడి అధికారుల తీరు అగ్రనేతలను సైతం అవమానించేలా ఉంది. మొన్న సీపీఎం అగ్రనేత.. నిన్న కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ఈ జాబితాలో చేరిపోయారు. ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్పీఎస్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాల్మీకి సమరభేరి బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బూటాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా.. పత్రిక, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే అతిథిగృహం అధికారులు సమావేశం నిర్వహించేందుకు వీల్లేదని అడ్డుతగిలారు.
చివరకు చేసేది లేక ఆయన అతిథిగృహం బయట నిల్చొనే విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు. జాతీయ స్థాయి నాయకుడికి జరిగిన అవమానంపై మేధావులు, వీఆర్పీఎస్ నాయకులు మండిపడుతున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తమ పట్ల అధికార యంత్రాంగం ఈ రీతిలో వ్యవహరించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా ప్రపంచ దేశాలకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరిని కేంద్ర ప్రభుత్వం రాయబారిగా పంపుతుంది. నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలోనూ భారత్ తరఫున ఆయన రాయబారిగా వెళ్లడం తెలిసిందే. అలాంటి నేతకు కూడా ప్రభుత్వ అతిథిగృహంలో అవమానం ఎదురైంది.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యుస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ ఏడాది మే 19న సీతారాం ఏచూరి కర్నూలుకు చేరుకున్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు వెళ్లగా అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన బయటే సమావేశం ముగించుకుని వెళ్లాల్సి వచ్చింది. అతిథిగృహం అధికారులు కనీసం నాయకుల హోదాను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ప్రభుత్వ అతిథిగృహం సూపరింటెండెంట్ రామన్నను ‘సాక్షి’ వివరణ కోరగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అన్నారు. బూటాసింగ్ విలేకరుల సమావేశానికి డీఆర్వో లేదా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని చెప్పామే తప్పిస్తే.. ఆయనను అవమానించాలనే ఉద్దేశం లేదని వెల్లడించారు.