లాబీయింగ్‌ను చట్టబద్ధ్దం చేయాలి
ఆసోచామ్ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సంబంధాల్లో పారదర్శకత పెంచడానికి లాబీయింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఆసోచామ్ కోరింది. ప్రభుత్వ రహస్య అధికారిక పత్రాలను చేజిక్కించుకునే కార్పొరేట్ గూఢచర్యం వెలుగుచూసిన నేపథ్యంలో ఆసోచామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లాబీయింగ్ అనేదానిని చెడ్డపదంగా పరిగణించకూడదని ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ పేర్కొన్నారు. లాబీయింగ్‌లో ఏది ఆమోదయోగ్యమైనదో, ఏది కాదో, ఏది చట్టబద్ధమైనదో, ఏది చట్టవిరుద్ధమైనదో నిర్వచించే సమయం ఇదేనని చెప్పారు. చాలా దేశాల్లో లాబీయింగ్‌కు స్పష్టమైన నిర్వచనం ఉందని, భారత్‌లో మాత్రం లాబీయింగ్ అంటే లంచాలివ్వడంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.
పారదర్శకత కావాలి
విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత అవసరమని రావత్ పేర్కొన్నారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని నినాదంగా కాక ఆచరణలో చూపాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏ భారత పౌరుడైనా ప్రభుత్వం నుంచి సమాచారాన్ని, కావలసిన డాక్యుమెంట్లను పొందవచ్చని గుర్తు చేశారు. బడ్జెట్ తయారీ కూడా పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.