అందని ‘అమ్మహస్తం’
భువనగిరి : అమ్మహస్తం పథకం పూర్తిగా వినియోగదారులకు అందకుండాపోయింది. ప్రభుత్వం కొత్త పథకం తేకపోవడంతో ఇంకా ఆ పేరుతోనే కొన్ని రేషన్‌సరుకుల సరఫరా కొనసాగుతోంది. కానీ సరుకుల కుదింపుతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. పండగ సమయంలో సరుకుల కోసం రేషన్ దుకాణాలకు వెళ్లిన వారు ఉత్త చేతులతో తిరిగివస్తున్నారు. ఇక పండగలకు ఇచ్చే అదనపు కోటా గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. గత ప్రభుత్వం సామాన్యుడిని అధిక ధరాభారం నుంచి రక్షించడానికి తె ల్లరేషన్కార్డులపై 9 రకాల సరుకులను 185రూపాయలకే అందించాలని అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి మొదటినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. తాజా పరిస్థితిలో 9 సరుకుల సంగతికి దిక్కులేకుండా పోయింది. కేవలం రెండు రకాల సరుకులతోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
తెలంగాణలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా పండగలకు ప్రజలు ఎక్కువగా పిండివంటలు చేస్తుంటారు. వీటికి అవసరమైన పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉండడం లేదు. ఏడు నెలలుగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. ప్రతినెలా జిల్లాకు 900 టన్నుల పామోలిన్ రావాల్సి ఉంది. ఎన్నికల ముందు నుంచి సరఫరా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విషయంలో స్పష్టత లేకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలుపుతున్నారు. కందిపప్పుది ఇదే పరిస్థితి. ఐదు నెలలుగా కందిపప్పు రావడం లేదు. కొత్త ప్రభుత్వం రావడం రవాణా టెండర్ల విషయంలో రేటు నిర్ణయం కాకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పేద ప్రజలకు ప్రధాన అవసరమైన కందిపప్పు, పామోలిన్ రాకపోవడంతో బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో రేషన్‌కార్డుల పరిస్థితి..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉండగా, 10.02 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. బోగస్ యూనిట్లు, రేషన్‌కార్డుల తొలగింపు అనంతరం తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిసి 9,03,333 రేషన్‌కార్డులు, వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు రంగుకార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిగతా నిత్యావసర సరుకులు సరఫరా లేకపోవడంతో వాటిని అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొంటున్నారు.