government talks
-
కార్పొరేట్ వైద్యభారంపై తర్జనభర్జన
కొలిక్కిరాని ఆసుపత్రులు, సర్కార్ చర్చలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఖజనాపై పడే అదనపుభారం గురించి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఐదున్నర లక్షలున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందడంలేదు. సమస్యను కొలిక్కి తీసుకురాకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. వైద్య మంత్రి కార్పొరేట్ ఆసుపత్రులతో సమావేశాలు నిర్వహించినా, సీఎస్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించినా పురోగతి లేదు. ఉద్యోగులకు ఉచితంగా ఓపీ సేవలందిం చాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఎంతోకొం త ఫీజు ఇవ్వాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు మొండికేస్తుడటంతో ప్రతిష్టంభన నెల కొంది. ఓపీ సేవలు ఉచితమైతే ఉద్యోగులు అవసరం ఉన్నా, లేకున్నా ఓపీ, వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది కార్పొరేట్ ఆసుపత్రుల ప్రధాన ఆరోపణ. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా అడుగు ముందుకు పడలేదు. శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్‌కు ప్రభుత్వం సుముఖంగా ఉంది. అయితే, మెడికల్ ప్యాకేజీ నిమ్స్ తరహాలో ఇవ్వాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా) కోరుతోంది. దీనిపై టీషా ప్రతినిధులను ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిమ్స్ తరహా ప్యాకేజీకి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకు రూ.450 కోట్ల మేర ఖజానాపై అదనపు భారం పడుతుందని సర్కార్ అంచనా వేసింది. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 170 కోట్లకు మించి ఖర్చుకాదని భావిస్తోంది. -
వికలాంగ సంఘాలతో ముఖ్య కార్యదర్శి చర్చలు విఫలం
సమస్యలపై పోరు కొనసాగిస్తామన్న వికలాంగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు - వాటి పరిష్కారాల కోసం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికలాంగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వికలాంగ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ శనివారం సాయంత్రం వివిధ సంఘాలతో చర్చలు జరిపారు. గత డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని వికలాంగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వికలాంగుల పింఛన్‌ను మార్చిలోగా పెంచుతానని అప్పుడు సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, స్టడీసర్కిల్ ఏర్పాటు, ఇళ్ల మంజూరులో వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న జీవో అమలు ఈ రోజు వరకు ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. అసలు ఈ సమావేశాన్ని సీఎం నిర్వహించమన్నారా? లేక మీరే నిర్వహించారా? అని ప్రశ్నించగా, తానే నిర్వహిస్తున్నట్లు నీలం సహానీ చెప్పినట్లు సమాచారం. దీంతో వికలాంగ సంఘాలు ఈ చర్చలను తాము అంగీకరించలేదని తేల్చి చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ వికలాంగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రపంచ వికలాంగ హక్కుల దినోత్సవాన్ని బ్లాక్‌డేగా జరుపుకుంటామని చెప్పారు. అన్ని జిల్లాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి వికలాంగులు నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఎక్కడ కార్యక్రమంలో పాల్గొన్నా అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.