Governments comprehensive hospital
-
‘జూ’జీహెచ్!
పనిచేయని ఏసీల్లో ఎలుకలు.. మూలల్లో.. కలుగుల్లో పాములు.. ఇవన్నీ ఏ ‘జూ’లోనో కాదు. సాక్షాత్తూ మన పెద్దాసుపత్రిలో..! వీటికంటే ప్రమాదకరంగా నిర్లక్ష్యం కూడా ఇక్కడ వేళ్లూనుకుని ఉంది. మూషికాల దాడిలో పసికందు మృత్యుఒడి చేరినా.. సర్పాల భయంతో విధులు చేయలేమని సిబ్బంది మొత్తుకుంటున్నా.. అధికారులు, ప్రభుత్వం తీరు మాత్రం మారదు. ఈ వరుస దురదృష్టకర ఘటనలు అందరినీ కలచి వేస్తున్నా వీరి మనసు మాత్రం కరగదు. - గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మొన్న ఎలుక కాటు.. నిన్న పాముల సంచారం - తాజాగా రోగి చేతివేలును కరిచిన ఎలుక - రోగుల ఆరోగ్య భద్రతపై నీలినీడలు సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మూషికాల దాడిలో పసికందు మృతి చెందిన ఘటనతోనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఆసుపత్రి అధికారుల్లో కనువిప్పు కలుగుతుందేమోనని అంతా భావించారు. ఘటన జరిగిన వారం రోజులు వారంతా హడావుడి చేసి వదిలేశారు. శుక్రవారం రేడియాలజీ విభాగం 105వ నంబర్ గదిలో రక్తపింజరు పాము గమనించిన రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది మరువక ముందే శుక్రవారం రాత్రి ఆర్థోపెడిక్ విభాగంలో చెయ్యి విరిగి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న రాయపాటి యేసమ్మ చేతి వేలును ఎలుక కొరకడం తీవ్ర కలకలం రేపింది. ఇంత జరిగితే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఎలుక కరవలేదని రోగుల చేత చెప్పించే ప్రయత్నాలు చేయడం దారుణ ం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. జీజీహెచ్‌లో రోగుల భద్రతపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో.. రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల నుంచి రక్షణ కల్పించలేక 15 రోజులుగా సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ) మూతపడినా, పిల్లల శస్త్ర చికిత్సా విభాగంలో చేరేందుకు రోగులు విముఖత చూపుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూరోసర్జరీ విభాగంలో ఆపరేషన్ కోసం ఎదురుచూస్తూ పదిహేను రోజులుగా ముగ్గురు రోగులు మంచాలపై మూలుగుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి.. మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మరోవైపు జీజీహెచ్ ప్రతిష్టను దిగార్చింది. నలుగురు మంత్రులు, ఉన్నతాధికారులు జీజీహెచ్‌లో హడావిడి చేసి తూతూమంత్రంగా మృత శిశువు తల్లిదండ్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. జీజీహెచ్‌లోని అధికారులు, వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకుంటున్నట్లు సాక్షాత్తు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. నెలరోజులు కావస్తున్నా ఇంతవరకూ ఉత్తర్వులు మాత్రం వారికి అందలేదు. పాములు, ఎలుకలు ఆసుపత్రిలో సంచరిస్తున్నా వాటిని నివారించి తప్పుదిద్దుకోవాల్సిన ఆసుపత్రి అధికారులు మాత్రం రోగులను బెదిరించి ఎలుకలు కరవలేదని బొంకే ప్రయత్నాలు చేయడం క్షమించరాని విషయమని వైద్యులు, సిబ్బందే మండిపడుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి జీజీహెచ్‌ని ప్రక్షాళన చేసి పెద్దాసుపత్రిని రక్షించాలని పలువురు కోరుతున్నారు. -
జీజీహెచ్‌లో జీవన్‌దాన్ కమిటీ పర్యటన
- గుండె, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు త్వరలో అనుమతిస్తాం - మీడియాతో డాక్టర్ రవిరాజు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో గుండె, కిడ్నీలు మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చేందుకు జీవన్‌దాన్ కమిటీ శుక్రవారం ఆస్పత్రిలో పర్యటించింది. జీవన్‌దాన్ కమిటీ చైర్మన్, డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ఆధ్వర్యంలో వైద్య బృందం ఆసుపత్రిని పరిశీలించారు. స్పెషాలిటీ వైద్యులు ఆపరేషన్లు చేసేందుకు నిబంధనల మేరకు సరిపడా ఉన్నారా, లేరా, వారు ఎప్పటి నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు తదితర విషయాలను వైద్యులను పిలిపించి విచారించారు. ఆపరేషన్ థియేటర్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలు నిబంధనల మేరకు ఉన్నాయా లేవా, రోగులకు వైద్య సౌకర్యాలు ఏ మాత్రం ఉన్నాయనే విషయాలను అధ్యయనం చేశారు. అనంతరం డాక్టర్ రవిరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక గత జనవరిలో ఆంధ్రప్రదేశ్‌కు నూతనంగా జీవన్‌దాన్ పథకాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం విశాఖపట్నంలో మాత్రమే ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందని, జీజీహెచ్‌లో అనుమతులు మంజూరు చేశాక రెండో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుందన్నారు. గుండె, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వసతులను పరిశీలించామన్నారు. త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. మేము సిద్ధం : జీజీహెచ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ జీజీహెచ్‌లో నిపుణులైన వైద్యులు ఉన్నారని, అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉన్నారని, ఆధునిక వైద్య పరికరాలు ఉన్నాయని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పలపాటి సూర్యకుమారి, ఆయుష్ హాస్పటల్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ, జీవన్‌దాన్ పథకం చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ గాదె కృష్ణమూర్తి, న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారావు, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ గోఖలేకు అభినందనలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీలు పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ రవిరాజు అభినందించారు. దేశంలోనే గుండెమార్పిడి ఆపరేషన్లు చేసిన మొట్టమొదటి వ్యక్తి జీజీహెచ్‌లో పేదరోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. -
గుండె ఆపరేషన్లకు బ్రేక్
జీజీహెచ్‌లో మూలకు చేరిన హార్ట్‌లంగ్ మెషీన్ ఒకే ఒక శస్త్రచికిత్సతో రూ. 40 లక్షలు వృథా గుంటూరులోని పెద్దాసుపత్రిలో గుండె ఆపరేషన్లకు బ్రేక్ పడింది. రూ. 40 లక్షల వ్యయం చేసి కొనుగోలు చేసిన హార్ట్‌లంగ్ మెషీన్ మూలకు చేరడమే ఇందుకు ప్రధాన అడ్డంకిగా తెలుస్తోంది. గుండె ఆపరేషన్లు చేసేందుకు సీమాంధ్రలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అవసరమైన వైద్య సామగ్రి లేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో గుండె ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిసారిగా పాత గుంటూరుకు చెందిన ఓ బాలికకు గుండె ఆపరేషన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో హార్ట్‌లంగ్ మెషీన్ మూలనపడిన విషయం వెలుగుచూసింది. జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణగోఖలే ఈ నెల 10న పెద్దాసుపత్రిని సందర్శించారు. గుండె వైద్యవిభాగంలో ఉన్న హార్ట్‌లంగ్ మెషీన్ పరిశీలించి ఆపరేషన్ నిర్వహించేందుకు ఇది పనికిరాదని తేల్చిచెప్పారు. మూడేళ్ల కిందట ఆరోగ్యశ్రీ నిధులు వెచ్చించి రూ.40 లక్షల వ్యయ ంతో హార్ట్‌లంగ్ మెషీన్ కొనుగోలు చేశారు. అప్పట్లో సీటీఎస్ సర్జన్‌గా ఉన్న ఓ వైద్యుని వద్ద నుంచి ఈ మెషీన్ కొనుగోలు చేశారు. అయితే టెక్నికల్ అంశాలను పరిశీలించకుండా కొనుగోలు చేయడం వల్ల నేడు ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. ► అప్పట్లో కూడా దీనిపై ఒకేఒక్క ఆపరేషన్ నిర్వహించగా అదీ విఫలమైనట్టు చెబుతున్నారు. ► ముందుగా నిర్ణయించిన విధంగా నవంబరు 1వ తేదీ నుంచి గుండె ఆపరేషన్లు జరగాలంటే కొత్త హార్ట్‌లంగ్ మెషీన్ కొనుగోలు చేయాల్సిదేనంటున్నారు. మళ్లీ ఇంత డబ్బు ఇప్పుడు ఖర్చు చేస్తారా అంటే అదీ అనుమానమేనని అంటున్నారు. డీఎంఈతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం... గుండె వైద్యవిభాగంలో హార్ట్‌లంగ్ మెషీన్ మూలనపడ్డ విషయాన్ని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లి కొత్తది కొనుగోలు చేయడమా లేక ఉన్న పరికరానికి మరమత్తులు నిర్వహించడమా అనేది నిర్ణయిస్తాం. బయో మెడికల్ ఇంజినీర్లుతో పరికరాన్ని తనిఖీ చేయించి వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్