ఫాదర్ పెజ్జోనికి కన్నీటి వీడ్కోలు
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్: ప్రముఖ సామాజిక సేవకుడు ఫాదర్ లూయిజీ పెజ్జోనికి శుక్రవారం కన్నీటి నివాళులతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. లెప్రసీ సెంటర్లోని చర్చి ఆవరణలో అశేష జనం నడుమ పెజ్జోని భౌతిక కాయాన్ని ఖననం చేశారు. అంతకు ముందు దైవ ప్రార్థనలు చేసి, భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాపసభలో పలువురు మాట్లాడుతూ పెజ్జోని సేవలను కొని యాడారు. నల్లగొండ బిషప్ గోవింద్ జోజీ మాట్లాడుతూ పెజ్జోని లాంటి సేవా తత్పరులు అరుదుగా జన్మిస్తారని కొనియాడారు.
ఇటలీ దేశంలో పుట్టి ఈ పట్టణంలో కుష్ఠు రోగులకు సేవలందించటానికి స్థిరపడిన మహానుబావుడిని కోల్పోవడం తీరనిలోటని అన్నారు. పెజ్జోని తమ్ముడు జోసెఫ్ మాట్లాడుతూ నల్లగొండ ప్రజలు అన్న పెజ్జోనీ పట్ల చూపించిన ఆదరణ, అభిమానం మరువలేమన్నారు. ఇటలీ దేశంలో కుష్ఠురోగులకు సేవలందిస్తున్న వారందరి తరఫున సంతాపం తెలుపుతున్నానన్నారు. స్నేహం రెండు రెట్ల ప్రేమను పెంచుతుందనే ఇటలీ దేశపు నానుడిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంకా ఫాదర్ మోన్సిగ్నోర్, ఆరోగ్యం, జీవన్, సిస్టర్ స్టెల్లా, అబికా తమ ప్రగాఢ సంతాపం తెలి పారు. కార్యక్రమంలో ఏజేసీ నీలకం ఠం, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, పసల శౌరయ్య, 100 మంది సిస్టర్లు, ఫాదర్లు, ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.