govindapalle
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు. ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ చెక్ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సచివాలయాలు ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా రెండో విడతలో జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూ రీసర్వేతో కబ్జాలకు చెక్ ఎప్పుడో బ్రిటీష్ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్ డివిజన్లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ లాంటి సబ్‌డివిజన్ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు కబ్జా చేసే పరిస్థితి ఉండదు. అందించే రిజిస్ట్రేషన్ సేవలు ఇవే.. జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్ స్లిప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్ మెంట్ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్ రద్దు, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్!) సిద్ధంగా ఉన్నాం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – రాజ్‌కుమార్, పీఎస్ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం సేవలు మరింత సులభతరం ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్ రిజిస్ట్రార్లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. – నాయబ్ అబ్దుల్‌సత్తార్, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఆధిపత్యం కోసమే జంట హత్యలు
– గోవిందపల్లె కేసులో నిందితుల అరెస్టు - వివరాలు వెల్లడించిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఆళ్లగడ్డ : ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, అతని బావమర్ది మేరువ శ్రీనివాసరెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల అరెస్ట్ చూపించారు. అరెస్టయిన నిందితుల్లో గోవిందపల్లి గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగదాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణకాంత రెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డి, సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీనులు ఉన్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు హత్య ఎందుకు చేశారంటే.. ఎదుగుదల చూసి ఓర్వలేక.. ఇందూరు ప్రభాకర్‌రెడ్డి గతంలో శిరివెళ్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏచిన్న పనిపడినా ఇతని దగ్గరకు వచ్చేవారు. స్వతహాగా అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం గల ప్రభాకర్‌రెడ్డి.. తనదగ్గరకు వచ్చేవారందరికీ పార్టీ, వర్గం తేడాలేకుండా పనులు చేసిపెట్టేవారు. దీంతో గ్రామంలోని ప్రత్యర్థివర్గాలకు కళ్లుకుట్టేవి. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజవర్గస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ప్రత్యర్థుల జీర్ణించుకోలేక పోయారు. ఇతన్ని మట్టుబెట్టిబెడితే గ్రామంలో తమదే ఆధిపత్యం అవుతుందని భావించారు. ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదును కోసం ఎదరుచూస్తూ రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు. కుటుంబ కలహాలు తోడు.. ఇటీవల టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇందూరు ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్పీలో చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆయన సమీప బంధువు శ్రీధర్‌రెడ్డికి, ప్రభాకర్‌రెడ్డికి కుటుంబ కలహాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డిని మంచి చేసుకుని ప్రత్యర్థులు రెచ్చగొట్టారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగ దాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణకాంతరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డిలతోపాటు మరి కొందరు గ్రామస్తులు..సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీను దగ్గరకు వెళ్లి ప్రభాకర్‌రెడ్డిని చంపాలని రూ. 40 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. హత్యచేశారు ఇలా... ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి, బావమరిది శ్రీనివాసరెడ్డి, తమ్ముడు ప్రతాపరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్‌కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కుని ఉన్నారన్నారు. ప్రభాకర్‌రెడ్డి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వేటకొడవళ్లు, పిడిబాకులతో దాడి చేశారు. ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రభాకర్‌రెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు. ప్రత్యర్థులు.. ప్రభాకర్‌రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్‌రెడ్డి, దస్తగిరిబాబు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో అనుమానితుడు?
శిరివెళ్ల: గోవిందపల్లె జంట హత్యల కేసుకు సంబంధించి ఆరుగురు అనుమానితుల్లో కీలక వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. రెండు రోజుల్లో మిగిలిన వారిని అదుపులోకి తీసుకొని మిస్టరీని ఛేధించాలన్న ధ్యేయంతో పోలీసులున్నట్లు తెలుస్తొంది. -
వీడని జంట హత్యల మిస్టరీ
- అనుమానితుల పేర్లు వెల్లడికి పోలీసుల నిరాకరణ శిరివెళ్ల: గోవిందపల్లెలో జంట హత్యల కేసు మిస్టరీ ఛేదన పోలీసులకు కత్తిమీద సాము మాదిరిగా మారింది. మాజీ ఎంపీపీ ఇందూరి ప్రభాకరరెడ్డి, అతని బావమరిది మేర్వ శ్రీనివాసులరెడ్డి హత్యలో పది మంది అనుమానితులపై కేసు నమోదు చేశారు. అయితే అందులో గ్రామానికి చెందిన ఆరుగురు టీడీపీకి అనుకూలురుగా ఉండడం కాక హతులకు బంధువులు. అయితే అధికారికంగా పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. గ్రామస్తుల సహకారం లేకుండా హత్యలు జరగవని, అంతేగాక కిరాయి హంతకుల పాత్ర కూడ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు జరిగిన మరుక్షణమే అన్ని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. అయినా ఇంత వరకు కేసులో పురోగతి కనిపించలేదు. హత్యలు జరిగిన రెండో రోజు నుంచి అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు వెంట తీసుకెళ్లారా.. లేక ఎక్కడైన పారి వేశారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హత్య ఘటనా స్థలాన్ని దగ్గరగా ఉన్న ఓ బావిలో నీటిని బయటకు తీశారు. కాని ఆయుధాలు సమాచారం లభించ లేదు. పోలీసుజాగిలం బావి వద్ద కొద్ది సేపు ఆగి తిరిగి జాతీయ రహదారి వద్దకు పోయింది. అంతే దుండగులు హత్య అనంతరం నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లినటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండంగా మాజీ ఎంపీపీ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో మందుబాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యలో ఓ యువకుని పాత్రపై స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు అనేకంగా వినిపిస్తుండంతో సమగ్ర విచారణ చేస్తున్నారు. -
మూడు బృందాలతో గాలింపు
గోవిందపల్లె ( శిరివెళ్ల ) గోవిందపల్లెలో జరిగిన జంట హత్య కేసులో నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ఈశ్వరరెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలోని బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కోణాల్లో సమగ్రంగా విచారణ చేసి నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామన్నారు. దర్యాప్తు వేగంగా సాగుతుందని, ఈ దశలో వివరాలు వెల్లడించలేమన్నారు. నియోజక వర్గాలలో నాయకులకు కౌన్సెలింగ్ ఇస్తామని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సీఐ ప్రభాకరెడ్డి ఉన్నారు.