రిటైర్మెంట్ హోమ్స్.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు
సాక్షి, హైదరాబాద్: చదువు, ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న రోజులివి. మరి, మన అనుకునే ఆత్మీయ పలకరింపులు లేని మలి వయసు పెద్దల పరిస్థితేంటి? భద్రత, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయతలను కలబోసి పెద్దలందరికీ ఆసరాగా నిలుస్తున్నాయి రిటైర్మెంట్ హోమ్స్. ఒకే ఏజ్ గ్రూప్ పెద్దలందరిని ఒకే చోట నివాసితులుగా కలపడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం, వసతులు అన్నీ కూడా పెద్దల అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే రిటైర్మెంట్ హోమ్స్ ప్రత్యేకత.
ఎనభై ఏళ్ల వయసులో భోగి పండ్లు పోస్తారు. వీకెండ్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తారు. బర్త్ డేలు, మ్యారేజ్ డేలతో సర్ప్రైస్ చేస్తుంటారు. పండుగ సమయంలో భక్తిపారవశ్యంలో పులకించిపోతారు... ఇలా ఒక్కటేమిటీ ప్రతి రోజూ ఏదో ఒక పండుగ వాతావరణమే ఉంటుంది రిటైర్మెంట్ హోమ్స్‌లో. ఒకే ఏజ్ గ్రూప్ పెద్దలందరూ ఒకే చోట నివాసం ఉంటే కలిగే ఆనందం, ఆరోగ్యమే వేరు. ఇలాంటి పెద్దల గృహాలను పన్నెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు పరిచయం చేసింది సాకేత్ గ్రూప్. ఈసీఐఎల్ దగ్గరలోని సాకేత్ టౌన్షిప్లో ‘సాకేత్ ప్రణామ్’ పేరిట 333 గృహాలను నిర్మించింది. ప్రస్తుతం గౌడవల్లిలో సాకేత్ ప్రణామం పేరిట రెండవ రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. త్వరలో నగరం నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని సాకేత్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రవి కుమార్ చెప్పారు.
గౌడవల్లిలో 80 ఎకరాల విస్తీర్ణంలో సాకేత్ భూఃసత్వ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 5.65 ఎకరాల్లో సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. నాలుగు బ్లాక్‌లలో 513 ఫ్లాట్లుంటాయి. 411 చ.అ. నుంచి 2,700 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ఏ–బ్లాక్ 197 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఇందులో ఆక్యుపెన్సీ మొదలైంది. కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడా. బీ–బ్లాక్ లోని 163 గృహ నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2022 చివరికి పూర్తవుతాయి. సీ,డీ– బ్లాక్‌లు 2023లో కస్టమర్స్‌కు అందుబాటులోకి వస్తాయి. సాకేత్ – భూఃసత్వ ప్రాజెక్ట్‌లో ఫేజ్–1 కింద 220 విల్లాలను నిర్మించారు. ఇందులో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫేజ్–4లో 70 విల్లాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
నిర్మాణంలోనూ అవసరాలకే ప్రాధాన్యం..
పెద్దల అవసరాలకు తగ్గట్టుగానే రిటైర్మెంట్ గృహాలు నిర్మిస్తారు. వీల్‌చెయిర్ వెళ్లేంత వెడల్పాటి డోర్లు, బాత్రూమ్స్, లిఫ్ట్ ఉంటాయి. బాత్రూమ్, కారిడార్లు, హాల్లో గ్రాబ్ బార్స్, అత్యవసర సమయాల్లో వినియోగించే ప్యానిక్ బజర్లు ఉంటాయి. ప్రాజెక్ట్ అంతా యాంటీ స్కిడ్ ఫ్లోరింగే ఉంటుంది. ప్రాజెక్ట్‌లోని మొత్తం స్థలంలో కేవలం 30 శాతం మాత్రమే నిర్మాణం ఉంటుంది. మిగిలిన 70 శాతం ఓపెన్ స్పేస్, చెట్ల కోసం కేటాయించారు. రెస్టారెంట్, ఏసీ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. నివాసితులు కావాలంటే డైనింగ్ హాల్‌కు వచ్చి భోజనం చేయవచ్చు. లేదా ఫ్లాట్ కే పంపిస్తారు. ఇంట్లో పనులకు ప్రత్యేకించి పనిమనుషులుంటారు. 24 గంటలూ సీసీ కెమెరాల నీడలో కట్టుదిట్టమైన భద్రతా ఉంటుంది.
పెద్దల అవసరాలే వసతులుగా..
రిటైర్మెంట్ హోమ్స్ నిర్మాణంలోనే కాదు వసతుల ఏర్పాట్లలోనూ పెద్దల అవసరాలకు తగ్గట్టుగానే ఉంటాయి. ఉదాహరణకు పెబల్స్ మీద వాకింగ్ ట్రాక్, గెరియాట్రిక్ జిమ్, పచ్చని చెట్ల గాలిని పీలుస్తూ కూర్చోవటానికి వీలుగా బెంచీలు, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇలా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే ప్రతీ ఒక్క వసతులు ఇందులోనూ ఉంటాయి. అంబులెన్స్, ప్రతి బ్లాక్ లో ప్రత్యేకంగా నర్స్, అటెండర్ అందుబాటులో ఉంటారు. సాకేత్ ప్రణామంలో 30 వేల చ.అ.ల్లో వెల్ నెస్ హబ్ ను తీర్చిదిద్దుతున్నామని రవి కుమార్ తెలిపారు. ఒకేసారి 200 మంది కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వీలైన మల్టీ పర్పస్ హాల్ కూడా ఉంటుంది.
చదవండి:
హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్
సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే!