ఎక్కడి బిల్లులు అక్కడే..
గత నెల 5 నుంచి ట్రెజరీల్లో బిల్లులన్నీ ఫ్రీజింగ్‌లోనే...
♦ జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో 2 వేల బిల్లులు పెండింగ్
♦ పొదుపు చేసుకున్న జీపీఎఫ్ బిల్లులనూ ఆపిన వైనం
♦ ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల అసంతృప్తి
ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు జయమ్మ, వ్యవసాయశాఖ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ కార్యాలయంలో మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే కూతురు వివాహం చేయడంతో దాదాపు రూ.3 లక్షల అప్పయింది. అప్పు తీర్చేందుకు తాను పొదుపు చేసుకున్న జీపీఎఫ్ నుంచి రూ.3 లక్షలు తీసుకునేందుకు నెలన్నర రోజుల క్రితం ట్రెజరీకి ఏడీఏ రిక్వెస్ట్ ద్వారా పంపారు. కాని ఇంతవరకు బిల్లుకు మోక్షం లభించలేదు. కారణమేమంటే జీతాల బిల్లులు తప్ప ఇతరత్రా వేటిని పాస్ చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలుండటమే..
కర్నూలు(అగ్రికల్చర్):
ప్రభుత్వం జీతాలు మినహా ఎటువంటి బిల్లులు చేయవద్దని ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడ బిల్లులు అక్కడే నిలిచి పోయాయి. గత నెల 5 నుంచి అంటే నెల రోజులకు పైగా బిల్లులను ఫ్రీజింగ్లో పెట్టడంతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారు పడుతున్న ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు. ఒక్క జిల్లా ట్రెజరీలోనే 1000కి పైగా బిల్లులు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జిల్లాలోని 14 సబ్ ట్రెజరీల్లో మరో వెయ్యి బిల్లుల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. జీపీఎఫ్, సరండర్ లీవ్‌లు, మెడికల్, ఫీజు రీయింబర్స్‌మెంటు, విద్యుత్, వాటర్, స్కాలర్షిప్, ఆఫీసు ఖర్చులు, రైతుల ఇన్పుట్ సబ్సిడీ బిల్లులు పెండింగ్‌లోనే ఉండి పోయాయి.
దాచుకున్న మొత్తం కూడా తీసుకునే అవకాశం లేదా..
జీపీఎఫ్ అనేది ఉద్యోగులు తమ వేతనాల నుంచి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకున్న మొత్తం. దీన్ని కూడా తీసుకోకుండా ఆంక్షలు విధించడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. జీపీఎఫ్ బిల్లులు ట్రెజరీల్లో 100కు పైగా ఉన్నాయి. దాచుకున్న మొత్తం అవసరానికి తీసుకునే అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు అత్యవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోంది. చివరికి రైతుల ఇన్పుట్ సబ్సిడీ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం మధ్యలో..
సాధారణంగా ఆర్థిక సంత్సరం చివరిలో బిల్లులను ఫ్రీజింగ్లో పెడతారు. అయితే ఆర్థిక సంవత్సరం మధ్యలో బిల్లులను నిలిపి వేయడం గమనార్హం. గతంలో బిల్లులను ఫ్రీజింగ్లో పెట్టిన వారం, 10 రోజుల వరకే అమలు చేసేవారు. కానీ ఈ సారి నెల రోజులకు పైగా నిలుపుదల చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రచారానికి, ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలు, తదితర వాటికి అడ్డుగోలుగా ప్రజాధనాన్ని వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను నిలుపుదల చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా బిల్లుల ఫ్రీజింగ్‌ను ఎత్తి వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.