GPS policy
-
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్య నిర్ణయాలు ఇవే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. జీపీఎస్ బిల్లు అమలుకు ఆమోదం.. ►ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఆమోదం. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ►జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం. ►కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. ►ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం. ►ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం. ►ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది. ►ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ. దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది. ►కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం ►పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం. ►అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం ►భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం ►దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం. -
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, సచివాలయం: ఏపీలో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే, నర్సాపురం ఫిషరీస్ కాలేజ్ అండ్ యూనివర్సిటీకి 140 పోస్టులకు, 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇక, సీపీఎస్ విధానం రద్దు చేసి జీపీఎస్‌కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కాగా, మంత్రి చెల్లుబోయిన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఉభయ ప్రయోజనకరం. హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16శాతానికి పెంచాం. కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో పోస్టులు, సీతానగరం పీహెచ్సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ప్రతీ మండలంలో 2 జూనియర్ కాలేజీలకు ఆమోదం. ► కడప మానసిక వైద్యశాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం. చిత్తూరు డెయిరీకి 28.35 ఎకరాల భూమికి 99 ఏళ్లకు లీజుకు నిర్ణయం. విశాఖ మానసిక వైద్యశాలలో 11 పోస్టుల మంజూరు. ► ఇక, ఒడిశా మృతులకు కేబినెట్ సంతాపం తెలిపినట్టు వెల్లడించారు. బాధితుల కోసం 50 అంబులెన్స్‌లు పంపించినట్టు తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాకు ఆమోదం తెలిపిందన్నారు. ► అనంతపురం, సత్యసాయి జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ► ఈనెల 12 నుంచి విద్యాకానుక పంపిణీకి నిర్ణయం. ఈనెల 28 నుంచి అమ్మఒడి పథకం అమలుకు నిర్ణయం. నాడు-నేడు కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు ఆమోదం. జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ► రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగింత. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత అర్చకులదే. ఐదేళ్ల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. ► పాడి రైతులకు సరైన ధర కల్పించాం. ఇవాళ పాల సేకరణ పెరిగింది. పాల ధర పెరిగింది. అమూల్ రావడం వల్ల పాడి రైతులకు మేలు జరిగింది. ► ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73శాతం డీఏకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
‘సీఎం జగన్ వల్ల 23ఏళ్ల కల నెరవేరింది’
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా జీపీఎస్‌ను తీసుకువచ్చింది. అలాగే, జిల్లా కేంద్రాల్లో పనిచేసేవారికి 12 శాతం నుంచి 16శాతం హెచ్ఆర్ఏను పెంచింది. ఇక, 12వ పీఆర్సీ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేశారు. అప్పుడు వైఎస్సార్ ఇప్పుడు సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో ఇచ్చిన హామీలకు, కొత్త పీఆర్సీ కమిటీ వేసేందుకు ఆమోదం తెలిపినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీపీఎస్ ఉద్యోగులకు కూడా న్యాయం చేశారు. సీపీఎస్ ఉద్యోగులు కూడా జీపీఎస్‌ను స్వాగతించాలి. గత ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు.. చేశారా?. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదనే ఆలోచనే వద్దు. కచ్చితంగా మళ్లీ ఈ ప్రభుత్వమే వస్తుంది. 2024లో మళ్లీ సీఎం అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని అన్నారు. ఇదిలా ఉండగా.. సచివాలయం వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ చరిత్రలో ఈరోజు ఒక మహత్తర ఘట్టం. 2009 నుంచి 2013 మధ్య రిక్రూట్ అయిన వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. నిన్నటి వరకూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా మేం ఉద్యోగాలు చేశాం. 2023 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నాం. జగనన్నే మా భవిష్యత్తు. కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రతకు మారు పేరు సీఎం జగన్మోహన్రెడ్డి. గత సీఎం కాంట్రాక్ట్ తుప్పు తెచ్చాడు. సీఎం జగన్ ఆ కాంట్రాక్ట్ తుప్పును వదిలించారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే వ్యక్తి చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. పులి కడుపున పులే పుడుతుంది. ఈ క్రమంలో జై జగన్ నినాదాలతో సచివాలయం ప్రాంగణం హోరెత్తింది. తమను క్రమబద్ధీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర -
మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను ప్రతిపాదిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చాం. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం. అందుకే సీపీఎస్ స్థానంలో అంతకంటే మెరుగైన జీపీఎస్‌ను ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు జీపీఎస్ వద్దు.. అవసరమైతే ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)లో కొన్ని అంశాలను సవరించమంటున్నారు. ప్రభుత్వం జీపీఎస్‌లో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తానంటోంది. త్వరలోనే రెండింటి మధ్య ఎక్కడోచోట సమస్య పరిష్కారమవుతుంది. అప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’.. అని బొత్స అన్నారు. జీపీఎస్‌లో అదనపు బెనిఫిట్స్ ప్రతిపాదించారు.. మంత్రుల కమిటీ ద్వారా పాత పెన్షన్ విధానంపై తీపికబురు వస్తుందనుకుంటే నిరాశే ఎదురైందని రాష్ట్ర సీపీఎస్ ఉద్యమ వ్యవస్థాపకుడు పి. రామాంజనేయులు యాదవ్ అన్నారు. అయితే, కొత్తగా జీపీఎస్‌లో హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పిస్తామనడం సానుకూలంగా ఉందన్నారు. ఇక జీపీఎస్‌పై అయితే భవిష్యత్తులో చర్చలకు వచ్చేదిలేదని.. పాత పెన్షన్‌పై అయితేనే చర్చలకు వస్తామని ఆయన స్పష్టంచేశారు. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఓపీఎస్‌ను అమలుచేయమంటే జీపీఎస్‌పై చర్చిస్తున్నారన్నారు. దీంతో సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడిని చేపడతామన్నారు. ఎవరో పిలుపునిస్తే.. మేమా బాధ్యులమా? ఇక సీపీఎస్ ఉద్యోగుల బ్లాక్ డే సందర్భంగా విజయవాడలో శాంతియుతంగా సభ పెట్టుకుంటామంటే.. ఎవరో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే.. తమ సంఘ నాయకులను బైండోవర్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు అన్నారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. -
పనిచేసే చోటు అత్తగారిళ్లు కాదు
మున్సిపల్ శాఖ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ కర్నూలు(జిల్లా పరిషత్): రీజియన్ పరిధిలో కొందరు మున్సిపల్ కమిషనర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని, అత్తగారింటికి వచ్చినట్లు విధులకు వస్తున్నారని మున్సిపల్ శాఖ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ మండిపడ్డారు. కొందరు కమిషనర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జీపీఎస్ విధానంతో అందరిపై నిఘా ఉంటుందన్నారు. దొరికితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. శనివారం ఆయన కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 38 మున్సిపాలిటీల కమిషనర్లు, రెవెన్యూ, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీజియన్ పరిధిలో ఆస్తి పన్ను 90 శాతం వసూలు చేశామన్నారు. పన్నులు బాగా వసూలు చేసిన మున్సిపాలిటీల్లో టాప్‌టెన్‌లో ఏడు మున్సిపాలిటీలు మనవేనన్నారు. అందులో స్టేట్ ఫస్ట్, స్టేట్ లాస్ట్ కూడా మనదేన్నారు. నగరి 23 శాతం మాత్రమే వసూలు చేసి ఆఖరులో స్థానంలో నిలిచిందన్నారు. 34 మున్సిపాలిటీలు 90 శాతం, 3 మున్సిపాలిటీలు 85 నుంచి 87 శాతం, ఒకటి మాత్రం 23 శాతం వసూలు చేశాయన్నారు. మున్సిపాలిటీల అకౌంట్స్‌కు వార్షిక ఆడిట్ పూర్తయిందన్నారు. అన్ని మున్సిపాలిటీలకు 4జీ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. నాలుగు జిల్లాల్లో 1.30లక్షలు వ్యక్తిగత మరుగుదొడ్లు, 263 కమ్యూనిటీ మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. చికెన్, మటన్‌లను అద్దాల పెట్టెలో ఉంచి అమ్మాలని, ఈ మేరకు కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాంసం విక్రయ దుకాణానికి తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. కుక్కలు, పందుల విషయంలో నిర్ణీత పద్ధతిలో చర్యలు తీసుకుంటామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.212కోట్లలో రూ.68కోట్లు బకాయి ఉండిందని, అది కూడా వచ్చేసిందన్నారు. 2014-15 సంవత్సరానికి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించానమ్నారు. మున్సిపాలిటీల్లో ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించామన్నారు. రీజియన్ పరిధిలో గుర్తింపులేని మురికివాడలను గుర్తిస్తున్నామన్నారు. స్మార్ట్‌వార్డులను కౌన్సిలర్లు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని చెప్పారు. తాను కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 41వ వార్డును దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మెప్మా పీడీ రామాంజనేయులు, ఎస్ఈ సుధాకర్‌రావు, అనంతపురం మున్సిపాలిటీ కమిషనర్ నాగవేణి పాల్గొన్నారు.