ఐడీఎఫ్సీ బ్యాంక్ చేతికి గ్రామ విదియాల్
ముంబై : ఐడీఎఫ్సీ బ్యాంక్... తమిళనాడుకు చెందిన సూక్ష్మ రుణ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. ఈ సూక్ష్మ రుణ సంస్థ కొనుగోలుతో మరింతగా విస్తరిస్తామని ఐడీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. అయితే కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఐడీఎఫ్సీ వెల్లడించలేదు. ఈ కొనుగోలు కారణంగా మూడు దశాబ్దాల చరిత్ర గల గ్రామ విదియాల్ ఇక నుంచి తమ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని ఐడీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ, ఎండీ, రాజీవ్ లాల్ చెప్పారు. ఒక సూక్ష్మ రుణ సంస్థను ఒక బ్యాంక్ చేజిక్కించుకోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. తమ పూర్తిస్థాయి బిజినెస్ కరెస్పాండెంట్‌గా ఈ సంస్థ వ్యవహరిస్తుందని వివరించారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 310 గ్రామ విదియాల్ కేంద్రాలు ఐడీఎఫ్సీ పరం అవుతాయని, 12 లక్షల కుటుంబాలు తమ బ్యాంక్ ఖాతాదారులవుతాయని తెలిపారు. ఈ ఏడాది మార్చినాటికి గ్రామ విదియాల్కు రూ.1,502 కోట్ల నిర్వణ ఆస్తులు, 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ ఖాతాల్లో ఉన్న అన్ని రుణ ఆస్తులు ఐడీఎఫ్సీ బ్యాంక్‌కు బదిలీ అవుతాయి. అణగారిన వర్గాల, గ్రామీణ ప్రాంతాల వారీ జీవనోపాధిని మరింత మెరుగుపరచాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని గ్రామ విదియాల్ చైర్మన్ ఎస్. దేవరాజ్ చెప్పారు. ఈ కొనుగోలు వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు 8.4 శాతం లాభంతో రూ.52 వద్ద ముగిసింది.