US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్‌లు గెల్చుకొని 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా