తాత కూడా శవమయ్యాడు..
మద్దిపాడు : అనుకున్నంతా జరిగింది. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహమై కనిపించి కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చాడు. ఇప్పటికి కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం.. యజమాని కూడా దక్కలేదని తెలిసి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. మండలంలోని ఆన్నంగి గ్రామానికి చెందిన కుంచాల పెద్ద గోవిందు(65) తన మనువడు 11 ఏళ్ల లక్ష్మయ్యతో కలిసి చేపల వేటకు సోమవారం గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు మనువడు లక్ష్మయ్య మృతదేహాన్ని గుర్తించగా తాతా గోవిందు ఆచూకీ తెలియరాలేదు.
అప్పటి నుంచి మత్స్యకారులు రిజర్వాయర్‌లో గాలి స్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం మత్స్యకారులు తెప్పలపై వెళ్లి గాలలతో వెతికారు. గోవిందు గల్లంతైన ప్రదేశానికి కొద్ది దూరంలోనే మృతదేహం గాలానికి తగులుకుంది. గతంలో పాడైపోయిన వలలో చిక్కుకుని బయటకు రాలేక మరణించాడని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై మహేష్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.