లేఆఫ్స్ ప్రకటన, ఉద్యోగులు తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో, తమ గ్రేటర్ నోయిడా ఆపీసులోని 60 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వీరిని కంపెనీ నుంచి బయటికి పంపేసింది. ఇక మీరు కంపెనీలో పనిచేసింది చాలంటూ, లంచ్ తర్వాత ఆఫీసుకు రావాల్సినవసరం లేదంటూ పేర్కొంది. దీంతో ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. కనీసం నోటీసు లేకుండా తమను తొలగించడంతో, ఉద్యోగులు నోయిడా ఆఫీసు సెక్యురిటీ గార్డులపై దాడిచేశారు. ఆఫీసు ప్రాపర్టీకి నష్టం కలిగించారు. గత నెలలోనే కంపెనీ ఎలాంటి నోటీసులు లేకుండా 700 మందిని తొలగించింది. ఈ ఘటన అనంతరం వర్కర్లు ఆఫీసు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. గార్డులకు, ఉద్యోగులకు అర్థగంట పైగా వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో ఎలాగోల పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే కంపెనీ రిక్రూట్మెంట్ పాలసీకి అనుకూలంగా పనిచేయాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ఉండాలని గ్రేటర్ నోయిడా సర్కిల్ ఆఫీసర్-2 నిశాంక్ శర్మ ఉద్యోగులను కోరారు. ఆ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్‌తో నియమించుకున్నామని కంపెనీ అధికారులు స్పష్టంచేశారు. వీరిని తొలగించేటప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సినవసరం లేదని కూడా పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులు గార్డులపై దాడిచేశారని, ఫ్యాక్టరీని కూడా కొల్లగొట్టారని అధికారులు మండిపడ్డారు. కంపెనీ ప్రాపర్టీకి నష్టం వాటిల్లేలా చేయడంతో వీరిపై కంపెనీ ఎఫ్ఐఆర్ నమోదుచేయనున్నట్టు తెలిపారు. వ్యాపార నిర్ణయాలకు అనుగుణంగానే ఉద్యోగులపై వేటు వేసినట్టు కంపెనీ పేర్కొంది. నియమ, నిబంధనలకు, కాంట్రాక్ట్‌కు తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పింది.