'బాబు, కేసీఆర్ నియంతల్లా వ్యవహారిస్తున్నారు'
తిరుపతి: ఏపీ, తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమన్నారాయణ ఆరోపించారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలు నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆదివారం తిరుపతి నగరంలో శ్రీమన్నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... తిరుపతిలో గ్రీన్‌హంట్ సదస్సును భగ్నం చేయడం దారణమన్నారు. గృహనిర్బంధం చేసిన పౌరహక్కుల సంఘం నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో జరగనున్న గ్రీన్‌హంట్ సదస్సుకు హాజరుకావాల్సిన పలువురు ఏపీసీఎల్సీ నేతలను ఈ రోజు అనంతపురంలో గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిలో ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, హరినాథరెడ్డి, విజయకుమార్‌లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల అడవులను నాశనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను తక్షణం ఆపివేయాలని ఏపీసీఎల్సీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో గ్రీన్‌హంట్ సదస్సును ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నాయకులు అరెస్ట్‌తో ఆ సదస్సు వాయిదా పడింది.