అంధ విద్యార్థుల్ని చితకబాదిన ప్రిన్సిపాల్
కాకినాడ క్రైం : నెత్తురు, కన్నీళ్ల రంగేమిటో తెలియని చీకటి బతుకులు ఆ చిన్నారులవి. అసలు చీకటి, వెలుతురుల వ్యత్యాసమూ వారికి అంతుపట్టదు. వారు చేయని నేరానికి పుట్టుకతోనే విధి విధించిన క్రూరశిక్ష వారిని కబోదులుగా మిగిల్చింది. అలాంటి వారికి తమ ఆత్మీయపూరితమైన స్పర్శతోనే అన్ని వన్నెలనూ పరిచయం చేయాల్సిన వారే పగవారిలా విరుచుకుపడ్డారు. కనుపాపల్లా కాచుకోవాల్సిన వారే చూపులేని వారిపై తమ ప్రతాపం చూపారు. సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లు చేసిన ఈ క్రౌర్యం ఆలస్యంగా వెలుగు చూసింది. చివరికి వారి దేహశుద్ధికి, అరెస్టుకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి.
కేవీ రావు అనే వ్యక్తి కరస్పాండెంట్‌గా నడుస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలకు శ్రీనివాస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కూడా అంధులే. వివిధ సంస్థలు, విదేశీయులు ఇచ్చే విరాళాలతో నడిచే ఈ పాఠశాలలో అంధులకు వసతి కల్పిస్తూ, చదువు చెపుతుంటారు. కాజులూరుకు చెందిన 13 ఏళ్ల కూర్తి జాన్సన్ (6వ తరగతి), గుంటూరు జిల్లా శ్రీనగర్‌కు చెందిన 12 ఏళ్ల పాముల సురేంద్రవర్మ (6వ తరగతి), గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన 9 ఏళ్ల పులప సాయి (3వ తరగతి) పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు.
అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. అంతటితోనూ శాంతించక ముగ్గురిలో ఒకరిపై ఎక్కి తొక్కారు. ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు సోమవారం చానళ్లలో ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి ఆగ్రహం పట్టలేక కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లకు దేహశుద్ధి చేశారు. కలెక్టర్ నీతూప్రసాద్, డీఈఓ శ్రీనివాసులురెడ్డి పాఠశాల ను సందర్శించారు.
తాను అల్లరి చేస్తున్నానని చితకబాదారని సాయి, బ్రెయిలీ లి పి సరిగా నేర్చుకోవడం లేదని కొట్టారని సురేంద్ర, తన స్నేహితుడిని నాలుగు రో జుల క్రితం ప్రిన్సిపాల్ కొట్టడంతో బాధకలిగి అన్నం తినకపోవడంతో తనను హింసించారని జాన్సన్ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ ఫిర్యాదు చేయగా ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లను తిమ్మాపురం పోలీసులు అరెస్టు చేశారు.
గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతను స్కూల్ అసిస్టెంట్ ఆర్.రాజేంద్రకు అప్పగించారు. ఐసీడీఎస్ పీడీ ఎంజే నిర్మల ఆదేశాల మేరకు బాలల సంరక్షణాధికారి వెంకట్రావు బాధిత చిన్నారులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి వైద్యం చేయిస్తున్నారు. పిల్లలు కుదుటపడేవరకు తాము సంరక్షిస్తామని వెంకట్రావు తెలిపారు.
గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలకు సీడబ్ల్యూసీ నోటీసు
రంపచోడవరం : అంధబాలలను హింసించిన గ్రీన్‌ఫీల్డ్ ప్రిన్సిపాల్, కరస్పాం డెంట్లకు బాలల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూసీ) నోటీసు జారీ చేసినట్టు బాలల కోర్టు బెంచ్ మేజిస్ట్రేట్లు వై.సత్యశివానంద్, బాలు అక్కిస, పి.రత్నం, జి.మాచ్చారావ్ తెలిపారు. మీడియా వార్తను సుమోటోగా స్వీకరించి, ఈ నెల 26న రాజ మండ్రి బాలల కోర్టులో హాజరు కావాలని ఆదేశించామన్నారు. పాఠశాలపై తీసుకున్న చర్యలను డీఈఓ, వికలాంగ సంక్షేమ శాఖ ఏడీ అదే రోజు తెలపాలని అన్నారు.