ఐదు మెగా ప్రాజెక్టులకు ఓకే
* అనుమతులిచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక మండలి
* 21 రోజుల్లో అనుమతులివ్వకపోతే చర్యలు: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐదు మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా జిల్లా భోగాపురంలో మోహన్ స్పిన్నింగ్స్, అనంతపురం జిల్లా హిందూపురంలో ఇండియన్ డిజైన్స్, తూర్పుగోదావరి జిల్లా ఒంటిమామిడి గ్రామంలో దివీస్ లేబొరేటరీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆటో మొబైల్ పరిశ్రమ ఎన్‌హెచ్‌కే స్ప్రింగ్స్, కర్నూల్ జిల్లాలో జైన్ ఇరిగేషన్ నేతృత్వంలో ఫుడ్ పార్కు, విశాఖ జిల్లాలో వేహాన్ కాఫీ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) అనుమతినిచ్చింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకొన్నారు. రూ. 2,300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ ఐదు ప్రాజెక్టుల వల్ల 35,700 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా తంగడెంచలో అంబూజా, జైన్ సంస్థలు ఆహారశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్న కారణంగా, ఈ రంగంలో యూనిట్లను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం సూచించారు.
నాయుడుపేటలో గ్రీన్‌టెక్ పరిశ్రమ తమ యూనిట్‌ను పెట్టేందుకు ఆసక్తి చూపుతోందని, ఖాయిలా పడ్డ చక్ర సిమెంట్స్‌ను పునరుద్ధరించేందుకు ఆ సంస్థ ముందుకొస్తోందని చంద్రబాబు అధికారుల దృష్టికి తెచ్చారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో సింగిల్‌డెస్క్ కృషి చేస్తోందని వివరించారు. ఇప్పటి వరకూ 417 పరిశ్రమలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, ఇందులో 217 దరఖాస్తులను క్లియర్ చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకూ ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్‌ను నిర్వహించాలని సీఎం సూచించారు. విశిష్ట కృషి చేసిన వారికి అవార్డులు ఇద్దామని ప్రతిపాదించారు.
చంద్రబాబుతో కేంద్ర మంత్రి తోమర్ భేటీ
కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సీఎంతో భేటీ అయ్యారు. ఆధునీకరణతో పాటు విస్తరణ పూర్తి చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును వచ్చే జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమంపై తోమర్ సీఎంతో చర్చించారు.
వచ్చె నెల 2న కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 2వ తేదీన నిర్వహించాలని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు.
29న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఈ నెల 29న సచివాలయంలో జరగనుంది. అదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పరపతి ప్రణాళికను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు.