వీడని ‘విష వలయం’ కాల్‌మనీ!
ఇప్పటి వరకు 1,003 ఫిర్యాదులు
ఇంకా వస్తూనే ఉన్న బాధితులు
ఫిర్యాదుల ప్రత్యేక సెల్ కొనసాగింపు యోచన
విజయవాడ సిటీ :‘కాల్’ మనీ విషయం విలయంలో ప్రజలు ఇంకా విలవిలలాడుతూనే ఉన్నారు. అవసరమో.. వ్యసనం కోసమో.. కారణమేదైనా ఒక్కసారి కాల్‌మనీ బారిన పడితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కమిషనరేట్‌కు వస్తున్న బాధితులు చెపుతున్న కథనాలే ఇందుకు నిదర్శనం. ఏళ్ల తరబడి కడుతున్నా.. వడ్డీ జమవుతుందే తప్ప అసలు తీరడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ అక్రమ వడ్డీ వ్యాపారం కనిపించకుండా చేయాలనే అభిప్రాయంతో ఉన్న కమిషనరేట్ పెద్దలు ప్రత్యేక విభాగాన్ని(కాల్‌మనీ సెల్) కొనసాగించాలనుకుంటున్నారు. ఇదే సమయంలో పోలీసు స్టేషన్లలో కాల్‌మనీ వ్యాపారులకు అనుకూలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు.
దశల వారీగా విస్తరణ
నగరంలో కాల్‌మనీ వ్యాపారం దశలవారీగా విస్తరించింది. రెండున్నర దశాబ్దాల కిందట కొందరు స్నేహితులు, ఒకేచోట పని చేసే కార్మికుల మధ్య కాల్‌మనీ ఇచ్చిపుచ్చుకోవడం ఉండేది. కాలక్రమేణా దీనిపై కన్నేసిన వడ్డీ వ్యాపారులు అవసరమైన వారిని గుర్తించి అప్పులు ఇవ్వడం ప్రారంభించారు. విజయవాడలో రోజుకు రూ.50 కోట్ల మేర వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆస్తుల తనఖా, వడ్డీ డబ్బుల కోసం చిట్టీలు కట్టించుకోవడం ప్రారంభమైంది. తనఖా ఆస్తులు రేటు పెరిగి విక్రయించుకుంటే, చిట్టీ సొమ్మును వడ్డీలకు మాత్రమే జమ చేసుకుంటున్నారు. దీంతో అప్పు అప్పుగానే ఉండగా ఆస్తులు మాత్రం హరించుకుపోతున్నాయి.
వస్తూనే ఉన్న బాధితులు
గత డిసెంబర్లో కాల్‌మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాల్‌మనీ వ్యాపారంపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం వ్యాపారులపై దాడులకు ఆదేశించింది. పోలీసులు కూడా దాడులు జరిపి కొందరిని అరెస్టు చేశారు. మరికొందరి నుంచి నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బాధితుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఏసీపీ కె.ప్రకాష్‌బాబు నేతృత్వంలో పలువురు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇరు వర్గాలను పిలిపించడం, విచారించడం, రాజీ చేయడం, కేసుల నమోదుకు సిఫారసు చర్యలను చేపడుతున్నారు. ఇప్పటి వరకు 1,003 ఫిర్యాదులు ప్రత్యేక విభాగానికి వచ్చినట్టు అధికారులు చెపుతున్నారు.
పోలీసుల చేతివాటం
కాల్‌మనీ వ్యాపారులతో సత్సంబంధాలు కలిగిన కొందరు పోలీసు స్టేషన్ల అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రత్యేక విభాగం నుంచి కేసు నమోదుకు వెళ్లినప్పుడు అధికారుల దృష్టి మరల్చేందుకు అరెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత వ్యాపారులకు బాధితులకు చెందిన చెక్కులు, నోట్లు కాల్‌మనీ వ్యాపారులకు ఇస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. పశ్చిమ జోన్ పరిధిలో ఇవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు బాధితుల ఆరోపణ.
దృష్టి పెడతాం
కొందరు పోలీసు అధికారులు కాల్‌మనీ వ్యాపారుల పక్షం వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వలన పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల్లోనే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఆరా తీసి తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రత్యేక ఫిర్యాదుల సెల్‌ను మరికొద్ది రోజులు కొనసాగించాలని నిర్ణయించాం.
డి.గౌతమ్ సవాంగ్, నగర పోలీసు కమిషనర్