ఎక్సైజ్ దాడులపై కిరాణా యజమానుల ధర్నా
జడ్చర్ల (మహబూబ్‌నగర్) : గుడుంబా తయారీకి బెల్లం విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులు దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సోమవారం కిరాణా దుకాణాల యజమానులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిరాణా దుకాణాల్లో బెల్లం విక్రయాలపై నిషేధం లేదని, తాము తీపి వంటలకు వినియోగించే తెల్ల బెల్లంను విక్రయించినా కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
బెల్లం విక్రయాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ వద్ద ఉన్న నిబంధనలు ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అసలు కిరాణా దుకాణాల్లో బెల్లం విక్రయాలు జరపాలా వద్దా, ఎంత మేరకు బెల్లం నిల్వ ఉంచాలో తెలియజేయాలన్నారు. బెల్లం తరువాత చక్కెరతో కూడా గుడుంబా తయారు చేసే పరిస్థితి ఉందని ఇకపై చక్కెర కూడా విక్రయించాలో లేదో చెప్పాలన్నారు. ఈ మేరకు తమ సమస్యలను తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.