ఐసీఐసీఐకి మొండిబకాయిల సెగ
♦ క్యూ3లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,122 కోట్లు; 4.4 % డౌన్
♦ ఆదాయం రూ. 25,585 కోట్లు; 11 శాతం వృద్ధి...
♦ 4.72 శాతానికి ఎగబాకిన స్థూల ఎన్పీఏలు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొన్ని బలహీన ఖాతాలకు సంబంధించి మొండిబకాయిల విషయంలో సమీక్ష జరిపి ముందస్తుగా కేటాయింపులు జరపడంతో స్థూల ఎన్పీఏలు పెరిగేందుకు దారితీసింది. ముఖ్యంగా ఉక్కు రంగంలో ఈ ఎన్పీఏల పెరుగుదల ప్రభావం అధికంగా ఉంది. ప్రస్తుత మార్చి క్వార్టర్లోనూ మొండిబకాయిల ఒత్తిడి కొనసాగవచ్చు
- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ
ముంబై: దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకును మొండి బకాయిలు వెంటాడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2015-16, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం (బీమా, మ్యూచువల్ ఫండ్ ఇతర అనుబంధ సంస్థలతో కలిపి చూస్తే) రూ.3,122 కోట్లుగా నమోదయింది.
కిందటేడాది ఇదే క్వార్టర్లో ఆర్జించిన రూ.3,265 కోట్లతో పోలిస్తే లాభం 4.4 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధి చెంది రూ.23,054 కోట్ల నుంచి రూ.25,585 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు ప్రొవిజనింగ్ భారీగా పెరగడం లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
ప్రస్తుత మార్చి క్వార్టర్లో కూడా ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ వెల్లడించడం గమనార్హం. ఇక స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.3,018 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,889 కోట్లతో పోలిస్తే కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది. మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.17,563 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.15,527 కోట్లుగా నమోదైంది.
భారీగా ఎగసిన మొండిబకాయిలు...
క్యూ3లో బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 4.72 శాతానికి ఎగబాకాయి. విలువ పరంగా ఈ మొత్తం రూ. 21,149 కోట్లు. క్రితం ఏడాది క్యూ3లో స్థూల ఎన్పీఏలు రూ.13,082 కోట్లు(3.4%) కాగా, ఈ ఏడాది క్యూ2లో ఇవి రూ. 6,759 కోట్లు(3.77%)గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో తైమాసికం నాటికి 2.28 శాతానికి (రూ.10,014 కోట్లు) దూసుకెళ్లాయి. క్రితం ఏడాది క్యూ3లో ఇవి రూ.4,773 కోట్లు(1.27%) కాగా, ఈ ఏడాది క్యూ2లో రూ.6,828 కోట్లు(1.65%)గా నమోదయ్యాయి.
ప్రధానంగా అంతర్జాతీయంగా ఉక్కు రంగంలో తీవ్ర మందగమనం నెలకొనటం, మరికొన్ని రంగాల్లో అనిశ్చితి పెరగటంతో ఎన్పీఏలు ఎగబాకినట్లు బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా రానున్న రెండు క్వార్టర్లలో ఎన్పీఏల ఒత్తిడి ఉండే ఖాతాలను ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా ప్రొవిజనింగ్‌పై దృష్టిపెట్టాలన్న ఆర్బీఐ నిబంధనలు కూడా ఎన్పీఏలు అధికంగా కనబడటానికి ఒక కారణమని తెలిపింది. కాగా, మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) కూడా ఈ ఏడాది క్యూ3లో భారీగా రూ.2,844 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ప్రొవిజనింగ్ మొత్తం రూ.980 కోట్లు మాత్రమే.
ఇతర ముఖ్యాంశాలివీ...
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) డిసెంబర్ క్వార్టర్లో రూ. 5,453 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ3లో రూ. 4,812 కోట్లతో పోలిస్తే 13% పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,091 కోట్ల నుంచి రూ.4,217 కోట్లకు ఎగబాకింది. ఇందులో ఫీజుల రూపంలో ఆదాయం రూ.2,262 కోట్లుగా నమోదైంది.
అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 4 శాతం వాటాను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, సంబంధిత సంస్థలకు విక్రయించేందుకు క్యూ3లో ఐఆర్డీఏ ఆమోదం లభించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ అమ్మకం ద్వారా రూ.1,243 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది.
క్యూ3లో మొత్తం రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. దీంతో డిసెంబర్ చివరినాటికి రుణాల పరిమాణం రూ.4,34,800 కోట్లకు చేరింది. ఇక డిపాజిట్లు 15 శాతం పెరిగి రూ.4,07,314 కోట్లకు చేరాయి. అనుబంధ సంస్థల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం క్యూ3లో రూ. 462 కోట్ల నుంచి రూ.436 కోట్లకు తగ్గిపోయింది.
ఇక ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం కూడా రూ.176 కోట్ల నుంచి రూ.130 కోట్లకు పడిపోయింది. ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.69 శాతం క్షీణించి రూ.233 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.