Group -1 prelims
-
అసలేం జరిగింది?.. గ్రూప్-1 ప్రిలిమ్స్ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా చేపట్టిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో అపశ్రుతులు, ఆరోపణలపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దృష్టిపెట్టింది. పలు పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు మారిపోవడం, నిర్ధారిత సమయం కంటే ఆలస్యంగా, ఎక్కువసేపు పరీక్ష నిర్వహించడం వంటివాటిని సీరియస్‌గా తీసుకుంది. ఆయా పరీక్షా కేంద్రాల్లో ఏం జరిగిందో గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. కాగా, హైదరాబాద్ జిల్లా లాలాపేట్‌లోని శాంతినగర్ సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలో 47మంది అభ్యర్థులు నిర్ధారిత సమయం ముగిసిన తర్వాత పరీక్ష రాశారు. దీంతో ఆ పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరా ఫుటేజీలను తెప్పించి పరిశీలించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కారకులెవరు.. చర్యలేమిటి? సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ కేంద్రంలో 47 మందికి ఇంగ్లిష్–తెలుగు ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లిష్–ఉర్ధూ ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన చేశారని.. ఉన్నతాధికారులు నచ్చజెప్పి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3.30గంటల వరకు పరీక్ష నిర్వహించారని హైదరాబాద్ అదనపు కలెక్టర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆ సెంటర్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఎవరు? ప్రశ్నపత్రం మారిపోవడానికి కారకులెవరు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారెవరు అన్న కోణంలో టీఎస్పీఎస్సీ విచారణ చేస్తోంది. దీనితోపాటు ప్రశ్నపత్రం మార్పుపై ఆందోళన మొదలు పెట్టిందెవరు, అభ్యర్థులను రెచ్చగొట్టిందెవరన్న వివరాలనూ ఆరా తీసే పనిలో ఉంది. ఇంత జరిగినా విషయాన్ని టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకురాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని.. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదికిచ్చి చర్యలకు సిఫార్సు చేయనున్నారని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జరగకుండా.. టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించే వారిని భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటివారి వల్ల పరీక్షా కేంద్రంలో ప్రశాంత వాతావరణం మారిపోయి, ఇతర అభ్యర్థులు సరిగా పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడుతుందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల్లో ప్రభుత్వ ఉద్యోగులు? సెయింట్ ఫ్రాన్సిస్ హైసూ్కల్ సెంటర్లో ఆందోళన చేసిన అభ్యర్థుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక అభ్యర్థి తానెవరో పరిచయం చేసుకుంటూ.. ఇతర అభ్యర్థులను రెచ్చగొట్టారని, ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని సైతం బెదిరించారని పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించిన వారు చెప్పినట్టు తెలిసింది. ఇలా ఆందోళనకు పాల్పడి పరీక్షా కేంద్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. -
గ్రూప్–1 మెయిన్స్‌కు 9,678 మంది
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు మొత్తం 9,678 మంది అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 2 నుంచి 13 వరకు ఈ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం వాటిపై సవరణ చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ముందు అర్హులుగా ఎంపికైన వారితోపాటు వీరూ పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ పరీక్షలకు ఎంపికైనవారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కాగా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికైనవారి ప్రొవిజినల్ జాబితాలను కమిషన్ గురువారం విడుదల చేసింది. -
అటు ఎన్నికల విధులు..ఇటు గ్రూప్–1 గుబులు!
సాక్షి, అమరావతి: ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలలుగా సాధారణ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నామని, కనీసం ఊపిరిపీల్చుకునే సమయం కూడా లేకుండా ఏపీపీఎస్సీ పరీక్షల విధులు ఎలా నిర్వహించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రూప్–1 కేటగిరీలోని 169 పోస్టుల భర్తీకి తలపెట్టిన ప్రిలిమ్స్ పరీక్ష 26న జరగనుంది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేపట్టింది. 254 పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు 1.14 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 17వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీచేస్తోంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలకపాత్ర పోషించే రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండే సమయంలో ఈ పరీక్షలను నిర్వహిస్తుండటంపై విమర్శలొస్తున్నాయి. పైగా ఈ పరీక్షలకు పోటీపడుతున్న వారిలో అనేకమంది ప్రస్తుతం వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న వారున్నారు. ప్రస్తుతం వారంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో పరీక్షలుండటంతో వారంతా అయోమయానికి గురవుతున్నారు. నిర్ణీత సమయం ఇవ్వకుండా.. గ్రూప్–1 నోటిఫికేషన్ తర్వాత కనీసం 150 రోజుల వ్యవధి ఇచ్చి ప్రిలిమ్స్ పెట్టాలి. కానీ ఏపీపీఎస్సీ కేవలం 69 రోజుల వ్యవధి ఇచ్చి మార్చి 10వ తేదీన పరీక్షలంటూ ప్రకటన ఇచ్చింది. దీనిపై అభ్యర్థులు ఆందోళనలకు దిగడంతో మార్చి 31కి మార్పు చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో షెడ్యూల్‌ను మే 26కి వాయిదా వేసింది. ఈ నెల 23న సాధారణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈసారి వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉండటంతో 24వ తేదీకి గానీ కౌంటింగ్ పూర్తికాదు. ఆ తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా రూపొందించే పనిలో ఉన్నతాధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉంటారు. ఈ తరుణంలో ఆ మర్నాడే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ఉండటంతో రెవెన్యూ యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే ఈ గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి తొలి నుంచీ ఏదో ఒక వివాదం ఏర్పడుతూనే ఉంది. రెండుసార్లు షెడ్యూల్ మార్పుచేయాల్సి రావడం, పోస్టుల కుదింపు, ఏడాదిలోనే సిలబస్ మార్పు, పరీక్షల విధానంలోనూ కొత్తగా మార్పులు.. తదితర అంశాలు ఈ పరీక్షల కోసం పోటీపడుతున్న లక్షలాది నిరుద్యోగులను ఇబ్బందులుపెట్టాయి. పోస్టులు కుదించి నోటిఫికేషన్.. ఏడాదిలోనే సిలబస్ మార్పు గ్రూప్–1 పోస్టుల ఖాళీలున్నా ప్రభుత్వం వాటన్నింటినీ భర్తీచేయడం లేదు. రాష్ట్ర విభజన నాటికి గ్రూప్–1 పోస్టులు 245 ఉండగా రిటైరైన వారి పోస్టులను కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇంతకు ముందు కేవలం 78 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత 182 పోస్టులు భర్తీచేస్తామని జీవో ఇచ్చి నోటిఫికేషన్లో 169 పోస్టులనే చూపారు. అలాగే 2016లో ప్రకటించిన గ్రూప్–1 నోటిఫికేషన్ సమయంలో ఏపీపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేసింది. దీంతో అప్పటివరకు ఉన్న సిలబస్‌తో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. 2018 చివర్లో ప్రస్తుత గ్రూప్–1కు నోటిఫికేషన్ ఇచ్చే కొద్దిరోజుల ముందు ఏపీపీఎస్సీ మళ్లీ సిలబస్ మార్పుచేసి ముసాయిదాను, తుది సిలబస్‌ను ప్రకటించి.. మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాదిలోపలే గ్రూప్–1 వంటి కీలక పరీక్ష సిలబస్‌ను హఠాత్తుగా మార్పు చేయడంపై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా రెండు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన ముఖ్యులు ఏపీపీఎస్సీలో చక్రం తిప్పుతున్నందునే ఇలా జరుగుతోందని ప్రచారం ఏడాది తిరక్కుండానే ఎన్నో మార్పులు గతంలో గ్రూప్–1లో స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 మార్కులకు ఉండగా.. ఈసారి పేపర్–1, పేపర్–2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచేశారు. గతంలో క్వాలిఫైయింగ్ పేపర్ కింద జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఒక్కటే ఉండగా.. ఇప్పుడు తెలుగును కూడా చేర్చారు. ప్రిలిమ్స్ పేపర్–1 గతంలో జనరల్ ఎస్సే మాత్రమే ఉండగా.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి అంశాలుంటాయని సిలబస్‌లో పొందుపరిచారు. పేపర్–2, పేపర్–3, పేపర్–4, పేపర్–5లలో గతంలో ఉన్న అంశాలను తీసేసి కొత్త వాటిని చేర్చడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. వీటిపై ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జరిగింది. -
రివ్యూ పిటిషన్ వేయనున్న ఏపీపీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వివాదాస్పద 6 ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్ జాబితా రూపొందించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ వేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. అయితే అంతకంటే ముందు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందాక న్యాయ సలహా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ తరువాత తదుపరి చర్యలు చేపడతామని ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయిన 606 మందిలో పలువురు అభ్యర్థులు కోర్టు తీర్పుపై ఆందోళన చెందుతూ మంగళవారం ఏపీపీఎస్సీకి వచ్చారు. చైర్మన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. మెయిన్స్ నిర్వహించకముందే ఆ ప్రశ్నలను తొలగిస్తే ఇబ్బంది ఉండేది కాదని, తామంతా మెయిన్స్ కోసం నెలల తరబడి వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ప్రత్యేక శిక్షణ తీసుకొని సిద్ధం అయ్యామని తెలిపారు. ఫలితాలు మాత్రమే వెల్లడించాల్సిన సమయంలో మళ్లీ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలన్న కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని కోరారు.అలాగే కోర్టు తీర్పు ప్రకారం ఆ ఆరు ప్రశ్నలను తొలగించి రూపొందించే మెరిట్ జాబితాలో అదనంగా వచ్చిన వారికి మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు కోరారు.