
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు మొత్తం 9,678 మంది అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 2 నుంచి 13 వరకు ఈ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేశారు.
గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం వాటిపై సవరణ చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ముందు అర్హులుగా ఎంపికైన వారితోపాటు వీరూ పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ పరీక్షలకు ఎంపికైనవారి జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కాగా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికైనవారి ప్రొవిజినల్ జాబితాలను కమిషన్ గురువారం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment