Group -1 mains
-
గ్రూప్ -1 పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థుల స్పందన
-
జూన్‌లో గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించాలని గతంలో నిర్ణయించిన ఈ పరీక్షలను జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ పరీక్షలకు సంబంధించిన మూడోవిడత ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరుగనుండడంతో ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఆ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేలా సన్నద్ధమయ్యేందుకు వీలుగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు తెలిపారు. రాష్ట్రం నుంచి 25 మందికిపైగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌లో ఎక్కువమంది విజయం సాధించేలా ఆయా అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వెసులుబాటు కల్పించేందుకు కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 3, 5, 6, 7, 8, 9, 10 వ తేదీల్లో గ్రూప్–1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. కమిషన్ ఇచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సకాలంలో పూర్తిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కమిషన్ అదేబాటలో నడుస్తోంది. టైమ్‌బౌండ్‌లో ఆయా నోటిఫికేషన్లను పూర్తిచేసి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేలా చేసింది. గ్రూప్–1 పోస్టుల విషయంలోను అదేరీతిన నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఫలితాల వరకు చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూలు ఉండే పోస్టుల నోటిఫికేషన్లను తొమ్మిదినెలల్లో, ఇంటర్వ్యూలు లేని పోస్టుల నియామకాలను ఆరునెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను మూడునెలల్లోనే పూర్తిచేయించి పోస్టులు భర్తీచేయించింది. అదే మార్గంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి 2022 అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీచేసి జనవరి 8న ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ఫలితాలను అదేనెల 27న విడుదల చేసింది. మెయిన్స్‌కు అభ్యర్థుల సన్నద్ధానికి వీలుగా 85 రోజుల వ్యవధి ఇస్తూ ఏప్రిల్ 23 నుంచి పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో కూడా మెయిన్స్ పేపర్లు తొమ్మిదికిగాను సగటున 90 రోజుల వ్యవధి ఇస్తుంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్–1లో ఏడు పేపర్లకు 85 రోజుల వ్యవధిని కమిషన్ అభ్యర్థులకు కల్పించింది. ఆగస్టు, సెప్టెంబర్ల నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తిచేయించేలా కమిషన్ కాలవ్యవధి నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలు.. గ్రూప్–1మెయిన్స్ తేదీల్లోనే జరుగనుండడంతో ఆ అభ్యర్థుల మేలును దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ మెయిన్స్ తేదీలను వాయిదా వేసింది. కమిషన్ నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సివిల్స్‌లో రాష్ట్రం నుంచి ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఎంతో మేలు చేకూరడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను ఎదుర్కొనేందుకు తమకూ అవకాశం కలుగుతోందని వారు పేర్కొంటూ కమిషన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో అంతా గందరగోళం గత ప్రభుత్వ హయాంలో గ్రూప్–1 నుంచి అన్ని నోటిఫికేషన్లలోను నిరుద్యోగులు తీవ్ర గందరగోళానికి గురికావలసి వచ్చిందని నిరుద్యోగ విద్యావంతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో గ్రూప్–1లో చోటుచేసుకున్న నిర్వాకాలను గుర్తుచేస్తున్నారు. 2016లో నాటి ప్రభుత్వ హయాంలో 78 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2017 మే 7న ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ఫలితాలు మే 27న విడుదల చేసి ఆగస్టు 17 నుంచి మెయిన్స్ పరీక్షలను పెట్టారు. అంటే కేవలం 81 రోజుల వ్యవధిని మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో మెయిన్స్‌లో ఇంగ్లిష్‌లో అర్హత సాధించకపోయినా నాటి ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన ఐదుగురిని ఇంటర్వ్యూలకు దొడ్డిదారిన ఎంపిక చేశారు. దీనిపై వివాదం రేగడంతో తిరిగి కొత్తజాబితాను ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక 2018 గ్రూప్–1 గురించి చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ జారీచేసి నిరుద్యోగులను నాటి టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఆనాటి గ్రూప్–1 ప్రిలిమ్స్ 2019 మే 26న జరిగింది. ఈ పరీక్షల్లో పూర్తి అక్రమాలు, అవకతవకలు జరగడంతో గందరగోళం ఏర్పడింది. ఏకంగా 42 ప్రశ్నలు, సమాధానాలు తప్పుగా రావడం, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో మొత్తం ప్రక్రియ ఆలస్యమైంది. చివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ గ్రూప్–1పై న్యాయవివాదాలన్నిటినీ పరిష్కరించి మెయిన్స్ నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేసింది. మెయిన్స్‌లో కూడా డిజిటల్ ఇవాల్యుయేషన్‌పై న్యాయవివాదాన్ని లేవనెత్తుతూ తెలుగుదేశం నేతలు నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా వాటిని కూడా పరిష్కరించి అభ్యర్థులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం న్యాయం చేసింది. కాగా, గ్రూప్–1 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. జూన్ 3 నుంచి 10వ తేదీవరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
గ్రూప్–1 మెయిన్స్‌కు 9,678 మంది
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు మొత్తం 9,678 మంది అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 2 నుంచి 13 వరకు ఈ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం వాటిపై సవరణ చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ముందు అర్హులుగా ఎంపికైన వారితోపాటు వీరూ పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ పరీక్షలకు ఎంపికైనవారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కాగా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికైనవారి ప్రొవిజినల్ జాబితాలను కమిషన్ గురువారం విడుదల చేసింది. -
గ్రూప్-1లో పొరపాటు ప్రశ్నలకు మార్కులు
కమిషన్ నిర్ణయాలు వెబ్సైట్లో సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఏపీపీఎస్సీ సెప్టెంబర్‌లో నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ప్రశ్నపత్రంలోని పొరపాట్లకు సంబంధించి అభ్యర్థులకు మార్కులివ్వాలని కమిషన్ నిర్ణయించింది. గ్రూప్-1 ప్రశ్నలపై కమిషన్‌కు అందిన అభ్యంతరాల పరిశీలనకు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను అనుసరించి కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ► పేపర్-2లోని 9వ ప్రశ్నలో అభ్యర్థులు ఆంధ్రమహాసభ, లేదా ఆంధ్ర మహిళా సభ రెండింటిలో దేనికి సమాధానం రాసినా మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ► పేపర్-3లోని 5(ఏ) ప్రశ్నలో ‘రెస్పాన్సిబులిటీ’, ‘రిఫార్మ్స్’ పదాలకు సంబంధించి తప్పుదొర్లింది. దీనికి సంబంధించి అభ్యర్థులు 5 (ఏ), 5 (బీ)లలో దేనికి సమాధానం రాసినా మార్కులివ్వాలని నిర్ణయించారు. ► పేపర్-5లోని 2 (బీ), 3వ ప్రశ్నలు సిలబస్‌కు సంబంధం లేనివిగా గుర్తించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసిన వారికి మార్కులు ఇవ్వనున్నారు. ► పేపర్-5లో 8 (ఏ)(2) ప్రశ్న, 8 (బీ)(3) ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. వీటిని తొలగించి మిగతా ప్రశ్నలకు ఆ విభాగంలోని పూర్తిమార్కులను పరిగణనలోకి తీసుకొని మూల్యాంకనం చేయనున్నారు. ► పేపర్-5లో 9 (ఏ)(1), 9(ఏ)(3), 9(ఏ) (5) ప్రశ్నలు తప్పుగా గుర్తించారు. ఈ విభాగంలోని 9వ ప్రశ్నకు సమాధానం రాసినవారందరికీ మార్కులు ఇవ్వనున్నారు. ► పేపర్-5లో 10(ఏ)(2) ప్రశ్నకూడా తప్పుగా వచ్చింది. 10 విభాగం ప్రశ్నకు సమాధానం రాసిన వారికి పూర్తిమార్కులు ఇవ్వనున్నారు. ► సిలబస్‌కు లోబడే ఉన్నందున కరెంట్ ఈవెంట్స్ ప్రశ్నలకు సంబంధించిన అభ్యంతరాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. -
ఏపీ గ్రూప్-1 పరీక్షా కేంద్రాల మార్పు
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల సౌకర్యార్థం ప్రస్తుతం జరుగుతున్న 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని అశోకా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(కోడ్-80102), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్(80103), నాదర్గుల్లోని ఏఎల్‌ఆర్‌ఆర్ జూనియర్ కాలేజీ(80109), ఇబ్రహీంపట్నంలోని ఎంఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్(80110)లలో ఇప్పటివరకు పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఇకనుంచి సాగర్‌రోడ్డులో ఇబ్రహీంపట్నం మండలం శేరిగుడ సమీపంలోని చింతపల్లిగుడ వద్ద ఉన్న అరబిందో కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్(80106)లో తదుపరి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. అలాగే పటాన్‌చెరువులోని ఆర్ఆర్ఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(80104)లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు అదే మండలం(పటాన్చెరువు)లోని ఇంద్రశాం దగ్గర ఉన్న ఆర్టీవో ఆఫీసు సమీపంలోని టర్బోమెషినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(80101)లో తదుపరి పరీక్షలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 21, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షలను కొత్తగా ఎంపిక చేసిన కేంద్రాల్లోనే రాయాలని ఆయా అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రానికి ఉదయం 8:30 నుంచి 9 గంటలలోపు హాజరుకావాలని, ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. -
పట్టిసీమ, హోదాలపై ఏపీ గ్రూప్-1లో ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్‌లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. పలు ప్రశ్నలను ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఓ ప్రశ్న ఇచ్చారు. పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించండి? అని మరో ప్రశ్న ఇచ్చారు. తొలిరోజు పరీక్షకు 3,128 మంది హాజరయ్యారు. -
నేటి నుంచి 2011 గ్రూపు-1 మెయిన్స్
హాజరుకానున్న 8,782 మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూపు-1 మెయిన్స్ రీ ఎగ్జామ్‌ను ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిం చేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని 17 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 8,782 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుంచి 9:15 వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ డేటా, ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు కనుక ఉదయం 9:15 లోపే పరీక్ష హాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. -
2011 గ్రూప్-1కు సొంత ఏర్పాట్లు
హైదరాబాద్: 2011లో నిర్వహించిన గ్రూపు-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏపీతో సంబంధం లేకుండా విడిగా మెయిన్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రిలిమ్స్‌లో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించి, అభ్యర్థులను మళ్లీ మెయిన్స్‌కు ఎంపిక చేసి పరీక్షను నిర్వహించడమా లేక ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త పరీక్షకు వెళ్లాలా అని సర్కారు యోచి స్తోంది. 2011లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో 6 తప్పులు దొర్లడంతో తాము మెయిన్స్‌కు అర్హత పొందలేకపోయామని అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది కోర్టు ఆదేశించింది.