జూన్‌లో గ్రూప్‌–1 మెయిన్స్‌ | Group-1 Mains in June Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జూన్‌లో గ్రూప్‌–1 మెయిన్స్‌

Published Wed, Mar 29 2023 4:07 AM | Last Updated on Wed, Mar 29 2023 4:07 AM

Group-1 Mains in June Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్‌ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) రీషెడ్యూల్‌ చేసింది. ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించాలని గతంలో నిర్ణయించిన ఈ పరీక్షలను జూన్‌ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనుంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షలకు సంబంధించిన మూడోవిడత ఇంటర్వ్యూలు ఏప్రిల్‌ 24 నుంచి మే 18 వరకు జరుగనుండడంతో ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది.

సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఆ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేలా సన్నద్ధమయ్యేందుకు వీలుగా గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కమిషన్‌ నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్‌.సలాంబాబు తెలిపారు. రాష్ట్రం నుంచి 25 మందికిపైగా సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌లో ఎక్కువమంది విజయం సాధించేలా ఆయా అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వెసులుబాటు కల్పించేందుకు కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 3, 5, 6, 7, 8, 9, 10 వ తేదీల్లో గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి.    

కమిషన్‌ ఇచ్చే ఏ నోటిఫికేషన్‌ అయినా సకాలంలో పూర్తిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కమిషన్‌ అదేబాటలో నడుస్తోంది. టైమ్‌బౌండ్‌లో ఆయా నోటిఫికేషన్లను పూర్తిచేసి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేలా చేసింది. గ్రూప్‌–1 పోస్టుల విషయంలోను అదేరీతిన నోటిఫికేషన్‌ నుంచి ప్రిలిమ్స్‌ ఫలితాల వరకు చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూలు ఉండే పోస్టుల నోటిఫికేషన్లను తొమ్మిదినెలల్లో, ఇంటర్వ్యూలు లేని పోస్టుల నియామకాలను ఆరునెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను మూడునెలల్లోనే పూర్తిచేయించి పోస్టులు భర్తీచేయించింది. అదే మార్గంలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి 2022 అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ జారీచేసి జనవరి 8న ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ఫలితాలను అదేనెల 27న విడుదల చేసింది. మెయిన్స్‌కు అభ్యర్థుల సన్నద్ధానికి వీలుగా 85 రోజుల వ్యవధి ఇస్తూ ఏప్రిల్‌ 23 నుంచి పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ ఇచ్చింది. యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షల్లో కూడా మెయిన్స్‌ పేపర్లు తొమ్మిదికిగాను సగటున 90 రోజుల వ్యవధి ఇస్తుంటుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1లో ఏడు పేపర్లకు 85 రోజుల వ్యవధిని కమిషన్‌ అభ్యర్థులకు కల్పించింది. ఆగస్టు, సెప్టెంబర్‌ల నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తిచేయించేలా కమిషన్‌ కాలవ్యవధి నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూలు.. గ్రూప్‌–1మెయిన్స్‌ తేదీల్లోనే జరుగనుండడంతో ఆ అభ్యర్థుల మేలును దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ మెయిన్స్‌ తేదీలను వాయిదా వేసింది. కమిషన్‌ నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సివిల్స్‌లో రాష్ట్రం నుంచి ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఎంతో మేలు చేకూరడంతో పాటు గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను ఎదుర్కొనేందుకు తమకూ అవకాశం కలుగుతోందని వారు పేర్కొంటూ కమిషన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. 


గతంలో అంతా గందరగోళం  
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌–1 నుంచి అన్ని నోటిఫికేషన్లలోను నిరుద్యోగులు తీవ్ర గందరగోళానికి గురికావలసి వచ్చిందని నిరుద్యోగ విద్యావంతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో గ్రూప్‌–1లో చోటుచేసుకున్న నిర్వాకాలను గుర్తుచేస్తున్నారు. 2016లో నాటి ప్రభుత్వ హయాంలో 78 గ్రూప్‌–1 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 2017 మే 7న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమ్స్‌ ఫలితాలు మే 27న విడుదల చేసి ఆగస్టు 17 నుంచి మెయిన్స్‌ పరీక్షలను పెట్టారు. అంటే కేవలం 81 రోజుల వ్యవధిని మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు.

అప్పట్లో మెయిన్స్‌లో ఇంగ్లిష్‌లో అర్హత సాధించకపోయినా నాటి ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన ఐదుగురిని ఇంటర్వ్యూలకు దొడ్డిదారిన ఎంపిక చేశారు. దీనిపై వివాదం రేగడంతో తిరిగి కొత్తజాబితాను ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక 2018 గ్రూప్‌–1 గురించి చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్‌ జారీచేసి నిరుద్యోగులను నాటి టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఆనాటి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ 2019 మే 26న జరిగింది. ఈ పరీక్షల్లో పూర్తి అక్రమాలు, అవకతవకలు జరగడంతో గందరగోళం ఏర్పడింది.

ఏకంగా 42 ప్రశ్నలు, సమాధానాలు తప్పుగా రావడం, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో మొత్తం ప్రక్రియ ఆలస్యమైంది. చివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ గ్రూప్‌–1పై న్యాయవివాదాలన్నిటినీ పరిష్కరించి మెయిన్స్‌ నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేసింది. మెయిన్స్‌లో కూడా డిజిటల్‌ ఇవాల్యుయేషన్‌పై న్యాయవివాదాన్ని లేవనెత్తుతూ తెలుగుదేశం నేతలు నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా వాటిని కూడా పరిష్కరించి అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం న్యాయం చేసింది. కాగా, గ్రూప్‌–­1 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ మంగళవారం విడుదల చేశారు. జూన్‌ 3 నుంచి 10వ తేదీవరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement