నల్లగొండ జిల్లాలో కత్తులతో దాడులు : ఒకరి మృతి
సూర్యాపేట: తన సోదరిను కొందరు ఆకతాయిలు ఆటపట్టిస్తుండటంతో.. ఓ అన్నయ్య తన స్నేహితులతో కలిసి వారిని మందలించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాజు సోదరి మిషన్ నేర్చుకోవడానికి వెళ్లి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఆమెను ఆట పట్టిస్తుండటంతో.. ఆమె విషయాన్ని తన అన్నకు చెప్పింది. దీంతో రాజు తన స్నేహితుడు ఉపేందర్(22)తో కలిసి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లాడు.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం అనంతరం కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో రాజు స్నేహితుడు ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.