థాయ్‌లాండ్‌లో ఆగని హింసాకాండ... బ్యాంకాక్ వీడిన ప్రధాని
దేశం కుప్పకూలుతుందనిఆర్మీ చీఫ్ హెచ్చరిక
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, హింసాకాండ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా దేశ రాజధాని బ్యాంకాక్‌ను వీడి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌కు 150 కి.మీ దూరంలో అధికార విధులు నిర్వహిస్తున్నారని ఆమె కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇంగ్లక్ రాజధాని బయట ఎన్నాళ్లుంటారో మాత్రం వెల్లడించలేదు. మరోపక్క సోమవారం థాయ్‌లాండ్‌లోని ఓ రాష్ట్రంలో ఇంగ్లక్ ప్రసంగానికి నిరసనకారులు అడ్డుతగిలారు. ‘ఓ పక్క ప్రజలను ఊచకోత కోస్తోంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావ్?’ అంటూ లౌడ్ స్పీకర్లు, విజిళ్లతో నిరసన తెలిపారు. ఆందోళనపై ఇంగ్లక్ స్పందిస్తూ..ప్రజలు హింసను విడనాడాలని కోరారు. మాజీ ప్రధాని, తన సోదరుడు థక్సిన్‌కు ఇంగ్లక్ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఆమె తక్షణం గద్దె దిగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. నిరసనల నేపథ్యంలో ఆమె గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జోక్యం పరిష్కారం కాదు: ఆర్మీ
ఇదిలా ఉండగా హింసాకాండ ఇలాగే కొనసాగుతూ పోతే దేశం కుప్పకూలుతుందని ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్‌ఓచా హెచ్చరించారు. అయితే ప్రస్తుత సంక్షోభానికి సైనిక జోక్యం పరిష్కారం కాదన్నారు. దేశాన్ని గడ్డున వేసేందుకు ఆర్మీ మరోసారి రంగంలోకి దిగే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. కాగా, గతవారం ఆందోళనకారుల ర్యాలీలపై ప్రభు త్వ బలగాలు జరిపిన దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు చనిపోయారు. దాడిలో మెదడుకు గాయాలైన ఆరేళ్ల బాలిక సోమవారం మృతి చెందిం ది. ఆమె సోదరుడు తల గాయాలతో శని వారం చనిపోయాడు. ట్రాట్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఐదేళ్ల బాలిక, మరో మహిళ మృతిచెందారు.