పరిశ్రమలకు తయారీ బూస్ట్
- జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2.6 శాతం
- ఏప్రిల్-జనవరి మధ్య ఈ రేటు 2.5 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి 2015 జనవరిలో 2.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంటే 2014 జనవరితో పోల్చితే తాజాగా జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 2.6 శాతం పెరిగిందన్నమాట. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటును లెక్కిస్తారు. సూచీలో దాదాపు 75 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం పనితీరు బాగుండడం తాజా సానుకూల ఫలితానికి ఒక కారణం.
డిమాండ్‌కు ప్రతిబింబంగా భావించే భారీ యంత్రపరికరాల (క్యాపిటల్ గూడ్స్) ఉత్పత్తి మెరుగ్గా ఉండడం కూడా ఊరటనిచ్చే వృద్ధి రేటుకు కారణం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ గడచిన 10 నెలల కాలంలో ఈ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 0.1 శాతం. 2014 జనవరిలో ఈ వృద్ధి రేటు 1.1 శాతం. 2014 డిసెంబర్లో 3.23 శాతం. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 1.7 శాతంగా ఉన్నా... తాజాగా దీనిని 3.23 శాతంగా సవరించారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజా లెక్కలను విడుదల చేసింది.
వివిధ రంగాల పనితీరును చూస్తే...
- జనవరిలో తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 0.3% నుంచి 3.3 శాతానికి ఎగసింది. మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 1.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణించింది (మైనస్).
- కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా 3.9 క్షీణ దశ నుంచి 12.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది. 10 నెలల కాలంలో కూడా ఉత్పత్తి -0.8 శాతం (క్షీణత) నుంచి 5.7 శాతం వృద్ధికి నడిచింది.
- విద్యుత్ ఉత్పాదకత వృద్ధి రేటు 6.5% నుంచి 2.7 శాతానికి తగ్గింది. 10 నెలల్లో మాత్రం ఈ వృద్ధి రేటు 5.7% నుంచి 9.3%కి ఎగసింది.
- మైనింగ్ రంగం కూడా 2.7 శాతం వృద్ధి నుంచి 2.8 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో మాత్రం ఈ రంగం ఉత్పత్తి 1.1 శాతం క్షీణత నుంచి 1.3 శాతం వృద్ధికి మళ్లింది.
వినియోగ వస్తువుల రంగం నిరాశ...
వినియోగ వస్తువుల ఉత్పత్తి 0.5 శాతం క్షీణత లోంచి మరింతగా 1.9 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో కూడా 2.7 శాతం క్షీణత మరింతగా 4.7 శాతం క్షీణతలోకి పడింది. ఇందులో ఒక భాగమైన దీర్ఘకాలిక వినియోగ వస్తువుల ఉత్పత్తి సైతం జనవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత 8.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. 10 నెలల కాలంలో సైతం క్షీణత 12.5 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక వినియోగ వస్తువుల విభాగంలో 4.5 శాతం వృద్ధి 0.1 శాతం క్షీణతలోకి పడింది. 10 నెలల కాలంలో చూస్తే వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 1.9 శాతానికి దిగింది.