ఎస్బీహెచ్ లాభం రూ.253 కోట్లు
ఎన్పీఏలకు భారీ కేటాయింపులతో తగ్గుదల
* ఈ ఆర్థిక సంవత్సరం లాభాల్లో 20% వృద్ధి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) నికర లాభం 43% క్షీణించి రూ. 253 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 446 కోట్లు. ఆర్బీఐ ప్రొవిజనింగ్ ఆదేశాకు అనుగుణంగా రానున్న కాలంలో మొండిబకాయిల రిస్కులను ఎదుర్కొనేందుకు కూడా భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో లాభాల పరిమాణం తగ్గిందని, లేకపోతే మెరుగ్గానే ఉండేదని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ ఆదివారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు.
ఎకానమీ వృద్ధి ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం, డిమాండ్ మందగించడం, ఖాతాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలు.. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్పీఏ) పెరుగుదలకు కారణమవుతున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, రాబోయే రోజుల్లో ఎన్పీఎ భారం తగ్గి.. నికర వడ్డీ మార్జిన్లు క్రమంగా మెరుగుపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. తాజాగా ఆరు కంపెనీలు వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) పరిధిలో వచ్చాయని, వీటిలో రెండు ఖాతాల పరిమాణం సుమారు రూ. 400 కోట్ల మేర ఉండగలదని ముఖర్జీ పేర్కొన్నారు.
చాలా మటుకు ఇన్ఫ్రా సంస్థలకు గడ్డు కాలం తొలగినట్లేనని, పరిస్థితులు క్రమంగా మెరుగుపడగలవని ఆయన చెప్పారు. పంట రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి రెండో విడత నిధులు కూడా అందాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మార్చి త్రైమాసికంలో ఎస్బీహెచ్ నిర్వహణ ఆదాయం రూ. 1,720 కోట్ల నుంచి రూ. 1,629 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 5% క్షీణించి రూ. 1,214 కోట్ల నుంచి రూ. 1,156 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్ 3.15% స్థాయిలో నమోదైంది.
పూర్తి సంవత్సరానికి..
మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీహెచ్ నికర లాభం 19 శాతం తగ్గుదలతో రూ. 1,317 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు పడిపోయింది. స్థూల నిరర్ధక ఆస్తులు 5.75 శాతానికి చేరి రూ. 6,591 కోట్లుగాను, నికర నిరర్థక ఆస్తులు 3.37 శాతం స్థాయిలో రూ. 3,743 కోట్ల మేర ఉన్నాయి. వ్యాపార పరిమాణం రూ. 2,54,599 కోట్లకు చేరింది. రాబోయే క్వార్టర్లలో కూడా మొండి బకాయిలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు మూడు రెట్లు అధికంగా రూ. 1,900 కోట్ల మేర జరిపినట్లు వివరించారు.
రుణాల మంజూరీ 5 శాతం వృద్ధితో రూ. 1,14,369 కోట్లకు చేరింది. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు (కాసా) డిపాజిట్లు సుమారు 13 శాతం పెరుగుదలతో రూ. 48,703 కోట్లకు చేరాయి. కాసా నిష్పత్తి 23 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ప్రధానమంత్రి జన ధన యోజన కింద తెరిచిన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 860గా ఉంటోందని, మొత్తం 35.37 లక్షల ఖాతాల్లో దాదాపు రూ. 546 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని ముఖర్జీ చెప్పారు.
విస్తరణ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిపాజిట్ల వృద్ధి 17-18 శాతం మేర, రుణాల వృద్ధి 12 శాతం మేర ఉండాలని నిర్దేశించుకున్నట్లు ముఖర్జీ చెప్పారు. అలాగే, నికర లాభాల్లో దాదాపు 20-25 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మరో 125 శాఖలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ముఖర్జీ చెప్పారు. ప్రస్తుతం మొత్తం 1,933 శాఖలు ఉండగా.. వీటిలో 776 తెలంగాణలో, 435 ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. ఇప్పటికే 51 ఈ-కనెక్ట్ కేంద్రాలు ఉండగా కొత్తగా మరో 25 ప్రారంభించనున్నట్లు ముఖర్జీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 1,200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం జరిగిందని వివరించారు.