GRRR Movie Review: మృగరాజుతో మత్తురాజు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘GRRR’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నిద్రతో వచ్చే మత్తు నిమిషాల్లో వదులుతుంది. కానీ నిషాతో వచ్చే మత్తు నీళ్ళలో నానితేగాని వదలదు. ఇదే పాయింట్‌తో ఇటీవల ఓ కామెడీ సినిమా రిలీజైంది. సినిమా పేరు కూడా గమ్మత్తుగా వుంటుంది. అదే ‘GRRR’.. ఈ సినిమా టైటిల్ ఇది. సింహం గురక భావనగా దర్శకుడు సృజనాత్మకతతో పెట్టిన పేరు. సినిమా పేరులో ఎంత గురక ఉందో సినిమాలో కామెడీ సరుకు అంత కన్నా ఎక్కువే ఉంది. వాస్తవ అంశాలను చక్కటి కథనంతో అల్లుకుని సున్నితమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు దర్శకుడు జేకే. కథాపరంగా రెజీమోన్ నాడార్ అనే వ్యక్తి మద్యం మత్తులో అనుకోకుండా జూలో ఉన్న సింహం గుహ దగ్గరకు చేరుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న జూ సూపర్వైజర్ హరిదాస్ నాయర్ కూడా అతని దగ్గరకు చేరుకుని అతన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక అక్కడ నుండి కథ మొదలు. జూ అధికారి అతన్ని సింహం నుండి కాపాడి తను కూడా బయటపడతాడా? లేదా అన్నది మాత్రం హాట్ స్టార్ వేదికగా ఓటీటీలోనే చూడాలి. ఇక్కడ నావెల్టీ పాయింట్ ఏంటంటే మత్తులో ఉన్న వ్యక్తి ఏమాత్రం భయపడకుండా సింహాన్ని తొడగొట్టి ఆహ్వానించడం... ఇంకా ఇలాంటివి ఎన్నో రసవత్తర సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా మొత్తం తెలుగులో డబ్ అయి ఉంది. అలాగే ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు లేవు కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూసేయొచ్చు. – ఇంటూరు హరికృష్ణ