గ్రామీణ మొబైల్ యూజర్లు @ 30 కోట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో జూన్లో కొత్తగా 21 లక్షల మేర జీఎస్ఎం కనెక్షన్లు పెరిగాయి. దీంతో మొత్తం గ్రామీణ జీఎస్ఎం యూజర్ల సంఖ్య 30.27 కోట్లకు చేరినట్లు సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ (సీవోఏఐ) తెలిపింది. భారతీ ఎయిర్టెల్ కనెక్షన్లు అత్యధికంగా 9.66 కోట్లుగాను, వొడాఫోన్ కనెక్షన్లు 9.09 కోట్లుగా, ఐడియా సెల్యులార్ కనెక్షన్లు 7.68 కోట్లుగా, ఎయిర్సెల్ 2.59 కోట్లు, యూనినార్ యూజర్ల సంఖ్య 1.23 కోట్లుగాను ఉంది. మొత్తం మీద వొడాఫోన్, ఐడియా సంస్థలకు సంబంధించి పట్టణ ప్రాంతాలను మించి గ్రామీణ యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అదే ఎయిర్టెల్, ఎయిర్ ఎల్, యూనినార్ విషయానికొస్తే.. పట్టణ ప్రాంతాల యూజర్ల సంఖ్య అధికంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం జీఎస్ఎం యూజర్ల సంఖ్య 73.95 కోట్లకు పెరిగింది.
30 కోట్లు దాటిన ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య
మొబైల్, ఫిక్సిడ్ లైన్, డీఎస్ఎల్, డీటీహెచ్ తదితర విభాగాలన్నింటితో కలిపి 30 కోట్ల కస్టమర్ల మైలురాయిని అధిగమించినట్లు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. 1995లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎయిర్టెల్ 2009లో 10 కోట్లు, 2012లో 20 కోట్ల కస్టమర్ల స్థాయిని సాధించింది. రెండేళ్ళ కన్నా తక్కువ వ్యవధిలోనే అదనంగా మరో 10 కోట్ల కస్టమర్లు జతయ్యారని ఎయిర్టెల్ పేర్కొంది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికాలోని 20 దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయి.