డిగ్రీ కోర్సుల్లో క్రీడల సబ్జెక్టు
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: అన్ని డిగ్రీ కోర్సులలో క్రీడలను ఒక సబ్జెక్టుగా చేర్చనున్నామని, త్వరలోనే దీనిని అమలు చేయనున్నామని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు వెల్లడించారు. ప్రతీ విద్యార్థికి క్రీడలలో నైపుణ్యం, అవగాహనకు క్రీడలను సబ్జెక్టుగా చేర్చాలని నిర్ణయించామన్నారు. గురువారం ఏఎంఏఎల్ కళాశాల వజ్రోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు క్రీడలపై ఆసక్తి కనబరచడం లేదని, ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు.
క్రీడల ద్వారా ఉద్యోగవకాశాలే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రతీ విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఉత్తీర్ణత కోసం పాకులాడకుండా నిర్ణీత లక్ష్యం సాధించేలా కృషి చేయాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ప్రతీ మూడు నెలలకు నిర్వహించే సెమినార్‌ను ఈ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. కార్పొరేట్ కళాశాలల ధాటికి తట్టుకొని సేవా భావంతో లాభాపేక్ష లేకుండా వర్తక సంఘానికి అనుబంధంగా విద్యా సంస్థలను నిర్వహిస్తున్న సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు)ను వీసీ రాజు కొనియాడారు.
ఏఎంఏఎల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎస్.ఈశ్వరరావు మాట్లాడుతూ కళాశాల 60 ఏళ్లు పూర్తి చేసుకొని కోస్తా జిల్లాల్లోనే ఉన్నతంగా నిలిచిందన్నారు. ఎం.కామ్, ఎమ్మెస్సీల్లో అత్యధిక ఉత్తీర్ణతతో ఏయూ తర్వాత స్థానంలో ఈ కళాశాలలే నిలిచిందని శ్లాఘించారు. ఈ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్తకసంఘం అధ్యక్షుడు తమ్మన రఘుబాబు, వైస్ ప్రెసిడెంట్ టి.వి. రమణమూర్తి, కళాశాల అధ్యక్షుడు ఎ.ఆర్.ఎల్.నరసింగరావు, కరస్పాండెంట్ కొల్లూరు ఎస్.ఎన్.మంగరాజులు మాట్లాడుతూ వర్తకసంఘం ఆధ్వర్యంలో అతి తక్కువ ఫీజులతో ఎలిమెంటరీ నుంచి పీజీ వరకు చదువుకునే అవకాశముందని చెప్పారు.
ఈ సందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ రాజును కళాశాల, వర్తక సంఘం సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పలువురు అధ్యాపకులను సన్మానించారు. అంత కుముందు స్టేడియం ఆవరణలో సరస్వతిదేవి విగ్రహాన్ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆవిష్కరించారు. సుమారు రూ.కోటితో నిర్మించిన ఇండోర్‌స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.