ముండ్లమూరు తహశీల్దార్ సస్పెన్షన్
సోదరుడి ఇంట్లో ఎన్నికల సామాగ్రి ఉంచిన వైనం
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు తహశీల్దార్ జిలానీ బాషాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి కంట్రోల్ యూనిట్‌కు అనుసంధానమై ఉండే ప్రింటర్ కం ఆక్సిలరీ డిస్ప్లే(పాడు) యూనిట్ లను నిర్దేశించిన కార్యాలయాలు, గోడౌన్లలో మాత్రమే ఉంచాలి.
అందుకు విరుద్ధంగా దర్శి నియోజకవర్గం పరిధిలోని ముండ్లమూరుకు చెందిన 30 పాడులను జిలానీ బాషా ఒంగోలు బండ్లమిట్టలోని తన సోదరుడి ఇంట్లో ఉంచారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్ వాటిని సీజ్ చేయించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సీజ్ చేసిన పాడుల స్థానంలో మరో 30 యూనిట్లు కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విచారణకు వైఎస్సార్ సీపీ వినతి
సాక్షి, హైదరాబాద్: దర్శి అసెంబ్లీ నియోజకవర్గం, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూంలో కాకుండా బయట ఉంచిన సంఘటనపై తక్షణం విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల కో-ఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.