ప్రజల గొంతుక గూడ అంజయ్య
గూడ అంజయ్య మృతిపై జిల్లా కవుల సంతాపం
ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మృతిపై జిల్లా కవులు, రచయితలు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రాగన్న గూడెంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రాసిన ‘ఈ ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా’ పాట విశేష ఆదరణ పొందింది. - నిజామాబాద్‌కల్చరల్
నిజామాబాద్ కల్చరల్: ప్రముఖ కవి గూడ అంజయ్య మృతితో జిల్లాకు చెందిన కవులు, రచయితలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ, సంతాపం ప్రకటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అంజయ్య మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు ఇందూరుకు వచ్చిన ఆయన.. తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన రాసిన పాటలు ప్రజలను జాగృతం చేశాయి. తెలంగాణ ఉద్యమం కుంటే ముందు కూడా జిల్లాలో వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారు. ఆయన మృతి నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు కవులు, రచయితలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఉద్యమానికి వెన్నెముకగా..
నాలుగు దశాబ్దాలుగా కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచాడని హరిదా రచయితల సంఘం నిజామాబాద్ అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ పేర్కొన్నారు. ఆయన రాసిన ‘ఊరు మనదిరా’ పాట తెలంగాణ అస్థిత్వాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు తీసుకెళ్లిందని కొనియాడారు. ఈ పాట 16 భాషలలో అనువాదమైందని ఆయన తెలిపారు. ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి ప్రతిరూపంగా జీవించిన అంజన్న తెలంగాణ మట్టి బిడ్డగా చివరి శ్వాస వరకు వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఫార్మాసిస్టుగా ఆరోగ్యాలు కాపాడిన ఆయన, రచయితగా సమాజాన్ని చైతన్యపరిచాడని కొనియాడారు. గూడ అంజయ్య మృతితో తెలంగాణ తల్లి శోకసంద్రంలో మునిగి పోయిందని, ఆయన ఆశయాలు తెలంగాణకు కాపు కాస్తూనే ఉంటాయని దేవేందర్ పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
గేయాల సిద్ధాంతి అంజయ్య..
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారుల గాయాలను గేయాలుగా మలచిన గేయ సిద్ధాంతి గూడ అంజయ్య అకాల మరణంతో తెలంగాణ మరో ముద్దు బిడ్డను కోల్పోయిందని తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 21)న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మృతి చెందగా, ఇదే రోజున గూడ అంజయ్య మరణించడం బాధకరమన్నారు.
తెలుగు సాహిత్యానికి తీరని లోటు
కామారెడ్డి రూరల్: ఉద్యమ కవి, సామాజిక కార్యకర్త గూడ అంజయ్య మరణం తెలుగు సాహిత్యానికి, పాటల ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
పాటలతో ప్రజల్లో చైతన్యం
గూడ అంజయ్య తన పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేశారని భావన సంస్థ అధ్యక్షుడు పడాల రామారావు పేర్కొన్నారు. పాటకు పట్టాభిషేకం చేసిన ఆయన కలం యోధుడని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఆయన రచించిన పాటలు ఉద్యమానికి ఊపిరిలూదాయని తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు సిర్ప లింగం, మేడిచర్ల ప్రభాకర్‌రావు, పొన్నాల గౌరిశంకర్, చిన్నయ్య, స్వామి, ఇందూరు భారతి ప్రధాన కార్యదర్శి మేక రామస్వామి తదితర కవులు, రచయితలు కూడా అంజయ్య మృతికి సంతాపాన్ని ప్రకటించారు.