అవినీతి కంపు
ఖైదీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు
జైలు లోపలికి వెళ్లిన దగ్గర నుంచి
బయటపడే వరకు ప్రతి పనికీ రేటే
ఆస్పత్రికి పంపాలంటే వేలల్లో చెల్లించుకోవాల్సిందే
రేషన్ డీలర్ల వ్యవహారంలో రూ.లక్షకు పైగా వసూలు!
గుడివాడ : గుడివాడ సబ్‌జైలులో అవినీతి పెచ్చుమీరుతోంది. జైలుకు వెళ్లిన నాటినుంచి తిరిగి వచ్చే వరకు సిబ్బందికి ఖైదీలు భారీ మొత్తంలో చేతులు తడపాల్సి వస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద చేపల నుంచి జైలు పెద్దలు దండుకుంటుంటే, చిన్న చేపల నుంచి కింది స్థాయి సిబ్బంది వసూలు చేసుకుని జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జైలులో ఏం చేయాలన్నా జేబుకు క్షవరం తప్పటంలేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కొద్దికాలంగా జరుగుతున్న పలు విషయాలు ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూశాయి.
ముక్కుపిండి మరీ వసూళ్లు...
గుడివాడ సబ్‌జైలులో గతంలో ఎన్నడూ లేని విధంగా నిందితుల బంధువుల నుంచి ముక్కుపిండిమరీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రేషన్ కార్డుల ఆధార్ అనుసంధానం వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన 40 మంది రేషన్ డీలర్ల నుంచి దాదాపు లక్ష రూపాయలకుపైగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సమాజంలో గౌరవప్రదంగా బతికినవారు అక్కడ ఎన్ని తిప్పలు పడాలో అనే అనుమానంతో జైలు పెద్దల వద్ద ముందుగానే బేరం కుదుర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుల వ్యవహారంలో జైలుకు వెళ్లిన వారి విషయంలో కూడా వసూళ్ల దందా చేశారని తెలుస్తోంది. రేషన్ డీలర్లుగా ఉన్నవారు సమాజంలో కొద్దోగొప్పో పలుకుబడి ఉన్నవారు కావడంతో వారితో ఎటువంటి పనీ చేయించకుండా.. తిట్టకుండా.. మర్యాదగా నడుచుకునే విధంగా ఉండేందుకు గాను ఒక్కొక్కరి వద్ద మూడు వేల రూపాయలు చొప్పున వసూలు చేసి జైలు అధికారులకు ఇచ్చినట్లు వినికిడి.
మూడు బ్యాచ్‌లుగా రేషన్ డీలర్ల అరెస్టులు జరుగగా ఇప్పటి వరకు 40 మందిని జైలుకు పంపారు. వీరంతా డబ్బులు ఇచ్చినవారేనని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పట్టణంలోని నాగవరప్పాడులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన లెక్చరర్ కేసు వ్యవహారంలో నిందితులను మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి తరలించే పేరుతో ముందుగా రూ.15 వేలు డీల్ కుదిరిందని తెలిసింది. అయితే పంపే ముందు మరో రూ.15 వేలు కావాలని జైలు అధికారి ఒకరు డిమాండ్ చేయటంతో తాము ఇవ్వలేమని చెప్పగా ముందుగా తీసుకున్న రూ.15 వేలు తిరిగి ఇచ్చారని వినికిడి.
బయటి నుంచి ఆహార పదార్థాలు తీసుకొస్తే...
జైలులో ఉన్న నిందితులకు ఆహార పదార్థాలు బయటి నుంచి తీసుకొచ్చినా అధికారులకు ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని చెబుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం రొట్టెలు, పండ్లు వంటివి మినహా ఇతర ఆహార పదార్థాలు ఏమాత్రం లోనికి అనుమతించరాదు. కానీ ఇటీవల రేషన్ డీలర్ల వ్యవహారంలో ప్రతి ఒక్కరికి రూ.10 విలువైన పెరుగు కప్పు తీసుకొచ్చినందుకు కూడా భారీ మొత్తంలోనే దండుకున్నారని వినికిడి. ఇక వైట్ కాలర్ నేరాలు చేసిన వారు జైలుకు వస్తే ఇక్కడి అధికారులకు పండగేనని తెలుస్తోంది. జైలులో ఉన్న నిందితులను కుటుంబ సభ్యులు కలవాలంటే రూ.300 సమర్పించుకోవాల్సిందేనని సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరు