ఈ యువకుడు యమజాతకుడు
ఓ యువకుడు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ తన ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఎదుటి వైపు నుంచి మరో బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. యువకుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లి పెద్ద శబ్దం వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఆ యువకుడి తీవ్ర ప్రమాదం జరిగిందని బస్సు ప్రయాణికులు భావిం చారు. స్పల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడిన యువకుడిని చూసి ఆశ్చర్యపోయారు.
ఈ ఘటన అవనిగడ్డ మండలం, తుంగలవారిపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని గుడివాకవారిపాలేనికి చెందిన గుడివాక వెంకటేశ్వరరావు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై నాగాయలంక బయలుదేరాడు. తుంగలవారిపాలెం వద్ద నాగాయలంక ఫంటు బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుగా నాగాయలంక నుంచి నర్సాపురం వెళ్లే బస్సు వేగంగా దూసుకొచ్చింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వెంకటేశ్వరరావు ద్విచక్రవాహనాన్ని వదిలేసి పక్కకు దూకాడు.
ఆ ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు వెళ్లిపోవడం, బస్సు పంటకాలువవైపు వరగటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే డ్రైవర్ బస్సును చాకచక్యంగా నిలిపివేశారు. ప్రయాణికులు అందరూ వెంకటేశ్వరరావుకు ఏ ప్రమాదం జరిగిందోనని ఆందోళన చెందారు. అతను స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.