పల్లెల్లోకి మద్యం మాఫియా..!
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్‌గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందుతోంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆబ్కారీ విధానం ముసాయిదాను పరిశీలిస్తే గుడుంబా నిర్మూలన కన్నా పల్లెలను మద్యం కాంట్రాక్టర్లకు అప్పగించి ఆదాయం పొందడమే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
బార్‌ను మరిపించేలా అన్ని బ్రాండ్లూ..!
ఎక్సైజ్ అధికారులతో నూతన మద్యం విధానంపై సమావేశమైన సందర్భంగా సీఎం ‘లాటరీ పద్ధతిలో మండలం లెసైన్సు పొందిన వారికి గ్రామాలలో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు ఇవ్వాలి’ నిర్ణయించారు. కానీ మండలం లెసైన్సు పొందిన వ్యక్తి గ్రామాల్లో చీప్ లిక్కర్‌తో పాటు అన్ని రకాల ఐఎంఎల్ బ్రాండ్లు, బీర్లు విక్రయించుకునే వెసులుబాటు బి-లెసైన్స్ ద్వారా లభిస్తుందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. ‘మద్యం దుకాణం గ్రామంలో తెరిచినప్పుడు చీప్ లిక్కర్ మాత్రమే అమ్మడం సాధ్యం కాదు. లెసైన్సుదారుడికి కూడా రూ.15 చీప్‌లిక్కర్‌తో గిట్టుబాటు కాదు’ అని ఆయన వివరించారు.
కోట్ల పెట్టుబడి ‘సిండికేట్ల’కే సాధ్యం
ఇప్పటివరకు మండలంలో మద్యం దుకాణం పొందాలంటే రూ. 32 లక్షల నుంచి 34 లక్షల వరకు పెట్టుబడి పెడితే సరిపోయేది. కానీ, కొత్త విధానం ప్రకారం... మండల కేంద్రంతో పాటు, మండలంలోని గ్రామాల్లో ఉన్న దుకాణాలకు లెసైన్స్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉండడంతో ఏడాదికి రూ. కోటిన్నరకు పైగా వెచ్చించాలి. ఇక డిపోల నుంచి మద్యం కొనుగోళ్లకు రోజూ లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. ఇది సాధారణ వ్యాపారం చేసుకునే వ్యక్తులకు అసాధ్యమనే విషయం ప్రభుత్వానికీ తెలుసు. అయితే, గంపగుత్త ఆదాయంపైనే దృష్టి పెట్టడంతో సిండికేట్లకే అప్పగించబోతోంది.
జిల్లా నుంచి మండల స్థాయికి డిపోలు..
ఉమ్మడి రాష్ట్రంలో 1993 వరకు సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండేది. 1983 వరకు జిల్లాకు ఓ సారా కాంట్రాక్టరు ఉండేవారు. వేలం ద్వారా ఆ జిల్లాలో వ్యాపారం మొత్తం అతడి ద్వారానే నడిచేది. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాక దానిని తాలూకా స్థాయికి విభజించారు. 1986-87లో సారా కాంట్రాక్టులు మండల స్థాయికి చేరాయి. ఇది సారాను నిషేధించిన 1993 వరకు కొనసాగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని నిర్ణయించిన మండలం యూనిట్‌గా మద్యం లెసైన్సుల జారీ కూడా సారా కాంట్రాక్టు విధానాన్నే స్ఫురణకు తెస్తోంది.
అబ్కారీ శాఖ తుది మెరుగులు
మద్యం పాలసీ ముసాయిదాకు సీఎం ఆమోదం తెలపడంతో మండల, పట్టణ, నగర, జీహెచ్ఎంసీ స్థాయిలో వేర్వేరు మద్యం విధానాలు రూపొందించే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమైంది. రెండో శనివారం సెలవు దినమైనా ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి(ఎక్సైజ్) అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అబ్కారీ భవన్లో జిల్లాల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, టీఎస్‌బీసీఎల్ ముఖ్య అధికారులు హాజరైన ఈ సమావేశంలో గత అమ్మకాల ఆధారంగా మండలాల్లో లెసైన్సు ఫీజులు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వార్డుల వారీగా మద్యం విధానం విభజన, జీహెచ్ఎంసీ ప్రత్యేక పాలసీకి సంబంధించి వివరాలు సేకరించారు. వారం రోజుల్లో క్షేత్రస్థాయి విధానాన్ని రూపొందించి, ముఖ్యమంత్రి ఆమోదంతో ప్రకటించాలని నిర్ణయించారు.