పునరావాసం
► గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
► స్వయం ఉపాధి కల్పనకు కార్యాచరణ
► జాబితా తయారీలో ఎక్సైజ్ అధికారులు
► ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఆర్థికసాయం
ఆదిలాబాద్:, వాటిని విక్రయిస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ ఉపా«ధి అవకాశాలు కల్పించడానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్టేషన్ల వారీగా అర్హుల జాబితాను తయారుచేస్తోంది. జూన్ 1 వరకు పూర్తిస్థాయిలో లబ్ధిదారుల వివరాలు సేకరించి జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గుడుంబా తయారీదారులకు పునరావాసం పథకం కింద బాధితులకు స్వయం ఉపాధి కల్పించనున్నారు.
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 360 మందిని గుర్తించారు. సారా విక్రయాలపై సర్కార్ గత ఏడాది నవంబర్ నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. సారాపై ఉమ్మడి జిల్లాలో ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కేసులు, బైండోవర్ చేయడం, గ్రామీణా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా మట్టుకు గుండా తయారీ తగ్గుముఖం పట్టిందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో గుడుంబా తయారీదారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 ఎక్సైజ్ స్టేషన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, బైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ ఉన్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే చాలా మారుమూల గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా, సారా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడల్లా ఎంతో మందిపై కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రధాన ఆధారం కావడంతో విక్రయిస్తూనే ఉన్నారు. జూన్ 2న రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్న నేపథ్యంలో తయారీదారులకు పునరావాస పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో కుటుంబాలు నాటుసారా, గుడుంబా అమ్మకాలే జీవనాధారంగా ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు అధికారులు ముమ్మరం చేస్తున్నారు. గుడుంబా తయారీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఈ విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. 2015 జనవరి నుంచి 2016 సెప్టెంబర్ వరకు గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంకు అర్హులుగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో ఇప్పటికే ఈ కుటుంబాలను గుర్తించేందుకు జాబితా తయారు చేస్తున్నారు. ఈ సాయంతో బాధితులు స్వయం ఉపాధి పొందనున్నారు. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.58 కోట్లు మంజూరు చేసింది.
వివరాలు సేకరిస్తున్నాం..
జిల్లాలో గుడుంబా తయారీ మానేసిన వారి వివరాలు సేకరిస్తున్నాం. జూన్ 1లోగా పూర్తి జాబితాను సిద్ధం చేయనున్నాం. పునరావాస పథకం కింద గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయనుంది. ఇప్పటికే జిల్లాల గుడుంబా నిర్మూలనకు కృషి చేస్తున్నాం.
– రమేశ్రాజ్, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్