అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
ఇటీవలే తండ్రి ఆత్మహత్య
జఫర్‌గఢ్/గూడూరు: నెల క్రితం అదృశ్యమైన గిరిజన ఆశ్రమపాఠశాల విద్యార్థిని వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం గర్మిళ్లపల్లిలో ప్రియుడితో కలసి పోలీసులకు పట్టుబడింది. గూడూరు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై సతీష్ ఆదివారం విలేకరులకు వివరించారు. గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాకు చెందిన బోడ రవి, విమల దంపతుల కూతురు కవిత (17) గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రవి, విమల హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండగా, కవిత గత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటోంది.
కాగా, జఫర్‌గఢ్ మండలం గర్మిళ్లపల్లికి చెందిన గబ్బెట చంద్రయ్య (30) గూడూరు ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కవితతో చంద్రయ్యకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో కుటుంబపరువు తీయవద్దని కవితను రవి మందలించాడు. మనస్తాపానికి గురైన కవిత డిసెంబర్ 3న బయటికి వెళ్లిపోయింది. అతను నెక్కొండకు కవి తను రాత్రి గర్మిళ్లపల్లికి తీసుకెళ్లాడు. చంద్రయ్యకు ఇదివరకే వివాహమైంది. మూడేళ్ల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది.
జనవరి 11న పోలీసులకు ఫిర్యాదు..
కూతురు వెళ్లిన విషయం సోదరులు రవికి చెప్పినా అతడు పట్టించుకోలేదు. దుర్గమ్మ పండుగకు రవి దంపతులు తండాకు వచ్చారు. బంధువులు, తండావాసుల రవిపై ఒత్తిడి తేవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ జనవరి 11న గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాతి పరిణామాలతో మానసిక క్షోభకు గురైన రవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
వాల్‌పోస్టర్ల ద్వారా విషయం వెలుగులోకి
కవిత కనిపించడం లేదంటూ శనివారం ఆమె ఫొటోతో కూడిన వాల్‌పోస్టర్లు మహబూబాబాద్‌లో అంటించారు. కవిత ఫొటో చూసిన ఓ వ్యక్తి చంద్రయ్యకు ఫోన్ చేసి అడగడంతో ఆమె తన వద్దనే ఉందని, పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సై సతీష్ సిబ్బందితో కలసి గర్మిళ్లపల్లి వెళ్లి కవితను, చంద్రయ్యను అదుపులోకి తీసుకున్నారు. కవిత మైనర్ కావడంతో మానుకోట మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, జడ్జి ఆదేశానుసారం బాలికను తల్లికి లేదా చిల్డ్రన్స్ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. చంద్రయ్యపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.