'తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం'
హైదరాబాద్: నవజాత శిశువు వంటి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హైదరాబాద్ - గుల్బర్గా ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును సురేష్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సురేష్ ప్రభు మాట్లాడుతూ... ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన గుల్బర్గాతో ఇక్కడి ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.
తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారి అవసరాల కోసం కాజీపేట్ - ఎల్టీటీ ముంబై రైలును ప్రారంభించామని గుర్తు చేశారు. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కార్గో రవాణాపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. చర్లపల్లి, నాగులపల్లిల్లో అంతర్జాతీయ టెర్మినళ్ల నిర్మాణానికి తోడ్పడతామని సీఎం కేసీఆర్కు హామీ ఇచ్చినట్లు సురేష్ ప్రభు వెల్లడించారు. కాచిగూడలో టెర్మినల్తోపాటు ఎంఎంటీఎస్ సర్వీసును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రైల్వేలను మరింత విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైనును ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం రైల్వే మంత్రి సురేష్ ప్రభు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ రజతోత్సవాలకు హాజరైయ్యారు. ఉద్యోగుల బోనస్ సీలింగ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆయన తెలిపారు. రైల్వే శాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారం, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరయ్యారు.