గన్ను వదిలి కలం లేక హలం పట్టండి:నరేంద్ర మోడి
గుమ్లా(జార్ఖండ్)(పిటిఐ): మావోయిస్టులు గన్నులు వదిలి పెట్టి పెన్నులు పట్టాలని బిజేపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. గుల్మాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మావోయిస్టులు హింసావాదం వదిలి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. మహాత్మా గాంధీ మనకు అహింసా సిద్దాంతాన్ని అందించారన్నారు. గన్నులు పట్టుకున్న యువత హింసను విడనాడాలని కోరారు. యువత చేతిలో కలం లేక హలం చూడాలన్నది తన కల అని, తుపాకి కాదని అన్నారు. కాంగ్రెస్ అవినీతి రాజకీయాలను ఎండగట్టారు. మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ తప్పుడు వాగ్ధానాలను చేసిందని విమర్శించారు. బిజెపి ఆధ్వర్యంలోని వాజ్‌పేయి ప్రభుత్వమే జార్ఖండ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, నరేంద్ర మోడీ బీహార్ పర్యటనకు ముందు మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గయా జిల్లాలో రెండు సెల్‌ఫోన్ టవర్లను గురువారం తెల్లవారుజామున అత్యంత శక్తివంతమైన బాంబులతో పేల్చివేశారు. దాదాపు వంద మంది మావోయిస్టులు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకొ మావోయిస్టుల గన్నులు వదిలి పెన్నులు పట్టుకోవాలని మోడీ పిలుపు ఇచ్చారు.
మావోయిస్టుల విధ్వంసంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గయా జిల్లాలో ఈ రోజు మోడీ పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. గయా జిల్లాలో మోడీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సాయంత్రం బీహార్‌లోని గయ, ససారామ్లలో మోడీ ప్రసంగిస్తారు.