gummagatta
-
ఖాకీ వనంలో ‘గోపాలుడు’
గుమ్మఘట్ట(అనంతపురం జిల్లా): క్షణం తీరిక లేని వృత్తిలో కొనసాగుతూనే పశు పోషణపై ఆసక్తి కనబరుస్తున్నారు గుమ్మఘట్ట ఎస్ఐ తిప్పయ్య నాయక్. ఇది గొప్ప అనుభూతినిస్తుందని అంటున్నారు. విధుల నిర్వహణలో ఆవుల పోషణ అడ్డంకి కాకూడదని భావించిన ఆయన.. తన స్వగ్రామంలో ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసి, వాటి రక్షణ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఏమాత్రం తీరిక దొరికినా.. వెంటనే స్వగ్రామానికి వెళ్లి ఆవుల మధ్య గడపడాన్ని ఆలవాటుగా చేసుకున్నారు. ఇది ఒత్తిళ్లతో కూడిన జీవితానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: AP: కొలువులు పట్టాలి పూర్వీకుల ఆస్తిగా... పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన లక్ష్మానాయక్, లక్ష్మీదేవి దంపతులకు రెండో సంతానంగా తిప్పయ్య నాయక్ జన్మించారు. ఉమ్మడి కుటుంబం విడిపోతున్నప్పుడు ఆస్తుల భాగ పరిష్కారంలో భాగంగా రెండు ఆవులు తిప్పయ్య నాయక్‌కు వచ్చాయి. తాను పోలీసు శాఖలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా.. పూర్వీకుల ఆస్తిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వచ్చారు. 30కి చేరిన ఆవుల సంఖ్య.. స్వగ్రామంలో తొలుత రెండు ఆవులతో మొదలైన సంరక్షణ బాధ్యతలు.. ప్రస్తుతం 30కి చేరుకుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్ వేశారు. వాటి పోషణకు తన జీతం నుంచి కొంత మొత్తం వెచ్చిస్తున్నారు. దీనికి తోడు భార్య వసంత లక్ష్మి, కుమారులు ఈశ్వర నాయక్, వరప్రసాద్ నాయక్ తరచూ స్వగ్రామానికి వెళ్లి పాడి పోషణను పర్యవేక్షిస్తున్నారు. పాల విక్రయానికి దూరం మందలో పాలిచ్చే ఆవులు పదికి పైగా ఉన్నా... వీటి పాలను ఇతరులకు విక్రయించడం లేదు. మొత్తం పాలను దూడలకే వదిలేస్తున్నారు. అయితే తల్లిని కోల్పోయిన నవజాత శిశువులకు, తల్లిపాలు లేక ఇబ్బంది పడుతున్న చంటి పిల్లలకు మాత్రం ఉచితంగా అందజేస్తున్నారు. నిత్యమూ ఒత్తిళ్లతో కూడిన పోలీసు శాఖలో పనిచేస్తున్న తాను.. ఎలాంటి ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి గోసంరక్షణే కారణమని ఎస్ఐ తిప్పయ్య నాయక్ చెబుతున్నారు. పాడి పోషణ ద్వారా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. -
కట్టుబాట్లలో.. కరోనా కట్టడిలో
గుమ్మఘట్ట: ఆ గ్రామం పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆదర్శవంతమైన ఆ ఊరి కట్టుబాట్లు. ఊరిలో ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యరాస్యులే. అయితేనేం.. కరోనా విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొంటూ తమ ఊరిని చుట్టుపక్కల గ్రామాలకు మార్గదర్శకంగా నిలిపారు. కట్టుబాట్లలోనే కాదు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలోనూ ఆదర్శంగా నిలుస్తోన్న ఆ గ్రామం పేరు అడిగుప్ప. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో గుమ్మఘట్ట మండల పరిధిలో అడిగుప్ప గ్రామం ఉంది. 150 కుటుంబాలు, 500 మందికిపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం విశేషం. జాగ్రత్తలే శ్రీరామరక్ష.. గ్రామంలో కొందరు యువత కరోనా పట్ల చెప్పిన జాగ్రత్తలే వారికి శ్రీరామరక్షగా నిలిచాయి. గ్రామంలో మాసు్కలేకుండా ఏ ఒక్కరూ బయట కనిపించరు. ఇప్పుడు ఆలయాలు, రచ్చకట్టల వద్ద గుంపులుగా కూర్చోవడం లేదు. పని ఉంటే తప్ప బయటకు రావటం మానేశారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కోడి మాంసం, కోడి గుడ్లు తరచూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ గ్రామంలో ఆ రెండూ ముట్టుకోరు. పూర్వీకుల కాలం నుంచి ఉన్న గ్రామ దేవుడి ఆచారాలకు కట్టుబడి కోడి మాంసం, కోడి గుడ్డులకు దూరంగా ఉంటూనే కరోనాపై విజయం సాధించారు. ధైర్యంగా ఉంటున్నాం.. మా పక్క గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తున్నా, భయపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గ్రామంలోని విద్యావంతులు ఎప్పటికప్పుడు కరోనా పట్ల గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ జాగ్రత్త పడేలా చూస్తున్నారు. – రాజేష్, గ్రామస్తుడు సమిష్టి కృషి.. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన అడిగుప్ప గ్రామం మా పంచాయతీ పరిధిలో ఉండడం గర్వంగా ఉంది. మద్యం విక్రయాలు, కోడి, కోడి గుడ్డు లాంటి వాటికి దూరంగా ఉండడం, ఎవ్వరూ నేరం చేసి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కకూడదు వంటివి ఈ గ్రామంలో ఆదర్శాలు. ఇప్పుడు గ్రామస్తుల సమష్టి కృషితో కరోనా కట్టడిలోనూ ఆదర్శంగా నిలిచింది. – ఎన్ రమేష్, సర్పంచ్,కేపీదొడ్డి పంచాయతీ -
మా మంచి వలంటీర్
గుమ్మఘట్ట: పనిచేస్తే ఫలితం తప్పక దక్కుతుందనేందుకు అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డిలో సోమవారం జరిగిన సంఘటన నిదర్శనంగా ఉంది. నిరంతరం తమ అవసరాలు గమనిస్తూ తమకు సేవ చేస్తున్న వలంటీరును 50 ఇళ్ల ప్రజలు కలిసి సత్కరించారు. సిరిగేదొడ్డి గ్రామ సచివాలయ పరిధిలో భూతయ్యదొడ్డి క్లస్టర్–7 విభాగంలో నాయకుల రాజేష్ గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. తన పరిధిలోని 50 కుటుంబాలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు. రోజూ ఇంటింటికీ తిరుగుతూ వారి కష్టసుఖాలు తెలుసుకునేవారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనదిగా భావించి పరిష్కారానికి చొరవ చూపేవారు. ఫలితంగా రాజేష్‌ను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. రాజేష్ వలంటీర్‌గా ఉద్యోగంలో చేరి సోమవారం నాటికి సంవత్సరం పూర్తికాగా ఆయన పరిధిలోని 50 కుటుంబాల వారు పార్టీలకు అతీతంగా సచివాలయం వద్దకు వచ్చి ఘనంగా సత్కరించారు. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, తోటి వలంటీర్లు అభినందనలు తెలిపి ప్రశంసించారు. ప్రతి వలంటీర్ రాజేష్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీవో శివరామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో సిరిగేదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత జయరామిరెడ్డి నిర్వాకం
సాక్షి, అనంతపురం: పురుగుల మందు తాగానంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నేత ఆడిన డ్రామా బెడిసికొట్టడంతో చివరికి అబాసు పాలయ్యారు. గుమ్మగట్ట టీడీపీ నేత జయరామిరెడ్డి సోమవారం పురుగుల మందు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. పురుగుల మందు తాగానంటూ రెవెన్యూ అధికారుల వద్ద డ్రామాకు తెరలేపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు బళ్లారి తరలించారు. జయరామిరెడ్డి పురుగుల మందు తాగలేదని బళ్లారి వైద్యుల రక్తపరీక్షలో వెల్లడయ్యింది. జయరామిరెడ్డి నాటకం ఆడారనే అనే వాస్తవం వెలుగు చూసింది. ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకే ఆయన ఆత్మహత్యాయత్నం నాటకం ఆడినట్లు తెలుస్తోంది. -
అనంతపురంలో రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తలారి శ్రీనివాసులు (38) రూ.3.5 లక్షల అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఎకరంన్నర పొలం, ఇంటిని కూడా అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో రూ.2.5 లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన అప్పు ఎలా తీర్చాలో అర్థంకాక.. తీవ్ర మనోవేదనలో.. సోమవారం తెల్లవారుజామున పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు.