ఎంసెట్–2 లీకేజీ వెలుగులోకి వచ్చిందిలా..
పరకాల : పరకాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు గుండెబోయిన రవి, వీరగంటి సతీష్, ఆకుల కృష్ణ, బొజ్జం రఘులు ఎంసెట్–2లో అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేయడంతో ఎంసెట్–2 లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లలను డాక్టర్లు చేయడమే లక్ష్యంగా ఎంచుకొని వేలాది రూపాయలు చదివిస్తున్నారు. ఎంసెట్–2లో ర్యాంకు తప్పనిసరిగా వస్తుందని భావించిన తరుణంలో పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాల వల్లనే అనుకున్న ర్యాంకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గుండెబోయిన రవి బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను సమాయత్తం చేసి ఎంసెట్–2 విచారణ కోసం పట్టుపట్టారు. దీనితో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా పరకాలకు చెందిన వాళ్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఒక్కొక్కటిగా లీకేజీ వ్యవహారం వెలుగులోకి వస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంసెట్–2 లీకేజీపై లోతైన విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను సైతం విచారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై రౌడీషీట్లు నమోదు చేయాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు రవి, సతీష్, కృష్ణ, రఘులు కోరుతున్నారు. ఎంసెట్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా విచారణ ఉండాలని కోరుతున్నారు. ఇంకా విచారణ జరుతుగుందని, నివేదిక తరువాత భవిష్యత్ ప్రణాళికను చెబుతామన్నారు.