gunipalli
-
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
బుక్కపట్నం : మండలకేంద్రంలో జరిగే ‘‘జన్మభూమి–మాఊరు’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుక్కపట్నం వస్తున్న సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్ ఇతర అధికారులు ముమ్మరం చేశారు. స్థానిక చౌడేశ్వరీ ఆలయ సమీపంలోని డిగ్రీ కళాశాల మైదానాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఈ స్థలంలోనే సీఎం సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బుక్కపట్నంలో పోలీసు అధికారులు భారీగా మొహరించారు. అలాగే బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్, సర్పంచ్ సాకే యశోద, ఎంపీపీ రవి, టీడీపీ మండల కన్వీనర్ వెంకటనారాయణరెడ్డి, గూనిపల్లి సర్పంచ్ లత పాల్గొన్నారు. -
‘చీనీ మొక్కలను ధ్వంసం చేయించింది డీఎస్పీనే’
బుక్కపట్నం : తన పొలంలో నాటిన చీనీ మొక్కలను ధ్వంసం చేయించింది డీఎస్పీ కేశన్న అని బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రామలింగారెడ్డి, అనూరాధ దంపతులు శనివారం ఆరోపించారు. రాశింపల్లి సమీపంలో ఆరెకరాల భూమిని కొనుగోలు చేసి, బోరు వేసుకుని 600 చీనీ చెట్లు నాటుకున్నామన్నారు. తనకు దక్కని భూమి మరెవ్వరికీ దక్కకూడదన్న కుట్రతో రాశింపల్లికి చెందిన డీఎస్పీ కేశన్న తన పోలీస్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని 400 మొక్కలను గురువారం రాత్రి నాశనం చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. -
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
బుక్కపట్నం : మండలంలోని గూనిపల్లిలో ఓ వివాహిత కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు.. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రవీందర్రెడ్డి భార్య ఊహ(24) తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. అయితే సోమవారం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడి ఉంది. స్కూల్ నుంచి వచ్చిన వారి పిల్లలు గమనించి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు బాధితురాలిని బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఊహ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యతీంద్ర తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.