త్వరలో నాయీబ్రాహ్మణుల జిల్లా కమిటీల ఏర్పాటు
చిలకలపూడి :
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి జిల్లాల వారీగా త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీల ద్వారా నాయీబ్రాహ్మణులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఆర్థిక వనరులు పెంపొందించుకునేందుకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. 11 మంది సభ్యులు ఉన్న ఒక్కొక్క సంఘానికి రూ. 7 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని, ఈ మొత్తంలో 50 శాతం సబ్సిడీగా ఇస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నాయీబ్రాహ్మణులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి నిపుణులచే శిక్షణ ఇస్తామని, డోలు, నాదస్వరానికి నాదపాఠశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని చెప్పారు. దేవాదాయశాఖలో భజంత్రీల పోస్టులు భర్తీ చేసేలా మంత్రితో మాట్లాడామని చెప్పారు. దేవాలయాల్లో ఎలక్ట్రానిక్స్ డ్రమ్స్‌ను నిషేధించి నాయీబ్రాహ్మణులచే వాయిద్యాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెలలో నాయీబ్రాహ్మణ సంక్షేమంపై అధ్యయన కమిటీ ఏర్పాటు చే స్తామని వివరించారు. ఫెడరేషన్ డైరెక్టర్ ఇమ్మనపూడి విజయకుమార్, సీహెచ్ వీరవసంతరావు, జి. యలమందరావు, రాయపూడి చిన్ని పాల్గొన్నారు.