విశ్లేషణలో సమతూకం.. మెరుగైన స్కోరింగ్‌కు మార్గం!
గురజాల శ్రీనివాసరావు,
సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ.
Writing is an beautiful అట్ట.. రాయటమనేది ఓ అందమైన కళ.. ఓ అంశానికి సంబంధించి మదిలోని భావాలకు అక్షరరూపం ఇచ్చి ఎగ్జామినర్‌ను మెప్పించడమనే ఉన్నత కళ.. విద్యార్థులకు విజయాలను దగ్గరచేస్తుంది. సివిల్స్ మెయిన్స్‌లో కీలకమైన పేపర్ ఎస్సే.. 250 మార్కులకు ఉండే ఈ పేపర్లో అధిక మార్కులు సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు అన్ని కోణాల్లోనూ విశ్లేషణాత్మకంగా రాయగలిగే నేర్పును సొంతం చేసుకోవాలి.. ఈ నేపథ్యంలో ‘జనరల్ ఎస్సే’ పేపర్‌కు సంబంధించి ప్రిపరేషన్ ప్రణాళిక..
సివిల్స్ మెయిన్స్‌లో మెరిట్ స్కోరింగ్‌కు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో ఎస్సే పేపర్ కీలకమైనది. ఓ ప్రణాళిక ప్రకారం పరీక్షకు సిద్ధమైతే ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు అవకాశముంటుంది. ఇచ్చిన అంశాన్ని నిశితంగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణాత్మకంగా రాస్తే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకుంటుంది. ఇలాంటి ఎస్సే రాసేందుకు అభ్యర్థులు తగిన ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది.
విభాగాల ఎంపిక:
సివిల్స్ మెయిన్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ఎస్సే ప్రిపరేషన్లో భాగంగా సామాజిక (Social); పర్యావరణం (Environment); ఆర్థిక (Economic); జాతీయ/అంతర్జాతీయ (National/International) ఇలా నాలుగైదు విభాగాలను గుర్తించాలి.
కనీసం రెండు అంశాల్లో పట్టు:
గుర్తించిన నాలుగైదు విభాగాలకు సంబంధించి ఐదు వరకు అంశాలను నోట్ చేసుకోవాలి. అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కనీసం రెండు అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకునేటప్పుడు అభ్యర్థులు తమ అభిరుచి, అకడమిక్ నేపథ్యం, మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టు తదితరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఎంపిక చేసుకున్న రెండు అంశాల నుంచి ఒక్కో దాన్నుంచి ఏడెనిమిది ఉప అంశాలను, మొత్తంమీద 15- 20 ఉప అంశాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి దానికీ సంబంధించిన సమస్యలు, సవాళ్లు, కారణాలు, ప్రభుత్వ చర్యలు, సమస్య పరిష్కారానికి అనుసరించే వ్యూహాలను చదవాలి. వీటికి అభ్యర్థులు.. ప్రభావవంతమైన, సానుకూల దృక్పథంతో కూడిన సొంత అభిప్రాయాలను జోడిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి.
విపత్తులు అనే అంశం నుంచి వరదలు అనే ఉప అంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఉప అంశాన్ని సమకాలీన సంఘటనలకు అనుసంధానిస్తూ విశ్లేషణాత్మకంగా చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇలా చదివితే పరీక్షలో ‘ఉత్తరాఖండ్’ వరదలకు సంబంధించి ఏ కోణంలో ప్రశ్న అడిగినా తేలిగ్గా ఎస్సే రాయడానికి అవకాశముంటుంది. ఇలా వివిధ ఉప అంశాలను గుర్తించి సమకాలీనంగా అధ్యయనం చేయాలి.
సబ్జెక్టు నిపుణుల సలహాతో:
గతంలో మాదిరి ఇప్పుడు నేరుగా ప్రశ్నలు రావడం లేదు కాబట్టి ఆయా ఉప అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు అభ్యర్థులు సబ్జెక్టు నిపుణులను సంప్రదించాలి.
వివిధ ప్రశ్నలకు సంబంధించి ఎస్సేలు రాసి వాటిని నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి. చేసిన పొరపాట్లను తెలుసుకొని వ్యాసాన్ని మరింత మెరుగ్గా రాయడానికి ప్రయత్నించాలి.
ప్రిపరేషన్‌కు దినపత్రికలు, వెబ్సైట్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
ఆ రెండు ఆప్షనల్స్‌కు బోనస్:
మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ఇతర ఆప్షనల్ సబ్జెక్టు తీసుకున్న వారితో పోలిస్తే జాగ్రఫీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న వారికి ఎస్సే పేపర్ బోనస్ అని చెప్పొచ్చు. వీరు ఆప్షనల్ ప్రిపరేషన్లో భాగంగా చదివే వివిధ అంశాలు ఎస్సేను ప్రభావవంతంగా రాయడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంస్కృతి, నాగరికత:
ఇచ్చిన ప్రశ్నల్లో ఒకటి సంస్కృతి, నాగరికత, కళలు, ఫిలాసఫీ తదితర అంశాల నుంచి వస్తుంది. చాలా వరకు ఇది సమకాలీనంగా చర్చలో ఉన్న విషయానికి సంబంధించినదై ఉంటుంది. ఈ ఎస్సే రాయగల సామర్థ్యం కొంత మందికే ఉంటుంది. సృజనాత్మకంగా విశ్లేషించే నైపుణ్యం, భాష మీద పట్టున్న వారు మాత్రమే ఇలాంటి ఎస్సేను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సామర్థ్యం లేకుండా ఎస్సేను రాయడానికి సిద్ధపడితే కోరికోరి చేతులు కాల్చుకోవడమే అవుతుంది.
జాతీయ, అంతర్జాతీయ విభాగానికి సంబంధించి పొలిటికల్, భద్రతలకు సంబంధించి ప్రశ్న కచ్చితంగా వచ్చేందుకు అవకాశముంది.
Ex: వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ దేశ పోకడలకు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు రష్యా.. అమెరికా చర్యల్ని గట్టిగా ప్రతిఘటిస్తోంది. తాజాగా సిరియాలో రసాయన ఆయుధాల సంక్షోభం నేపథ్యంలో అమెరికా అవలంబిస్తున్న వైఖరిని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని (Foreign policy) ఏ విధంగా మార్చుకోవడం అభిలషణీయమో వివరించండి? అనే ప్రశ్న రావొచ్చు.
ప్రశ్న ఎంపిక ఎలా?
అభ్యర్థులు ఎంపిక చేసుకునే ప్రశ్న అధిక మార్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అభ్యర్థులు సరైన సమాచారాన్ని చొప్పించేందుకు, వివిధ ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్ననే ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నను ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ట మార్కులు సంపాదించేందుకు వీలవుతుంది.
సమయ పాలన ప్రధానం:
జనరల్ ఎస్సే విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం సమయ పాలన. ఈ క్రమంలో ప్రశ్నను ఎంపిక చేసుకున్న తర్వాత కొంత సమయాన్ని వ్యాసంలో పొందుపరచాల్సిన అంశాల వరుస క్రమంతో స్ట్రక్చర్‌ను రూపొందించుకునేందుకు కేటాయించాలి. ప్రశ్నలో ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే ఆ సమస్యకు మూలాలు ఏమిటి?; పూర్వ, ప్రస్తుత స్థితి; సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు-వ్యూహాలు; అవి ఎంత వరకు సఫలీకృతమయ్యాయి? వంటి అంశాలతో ప్రణాళిక రూపొందించుకోవాలి. దీని ఆధారంగా ఎస్సే రాయాలి.
ప్రారంభం ఆకట్టుకోవాలి:
చాలా మంది అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ఓ అంశంపై బాగా అవగాహన ఉన్నప్పటికీ ఎస్సేను ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అభ్యర్థులు ఎస్సేను ప్రారంభించేందుకు సమకాలీన శైలి (Contemporary Style)ని అనుసరించాలి. దీంట్లో భాగంగా ప్రశ్నకు సంబంధించిన ఎస్సేను సమకాలీన నేపథ్యంతో ప్రారంభించాలి. ఉదాహరణకు ప్రశ్న ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలకు సంబంధించినది అయితే ఇటీవల బీహార్‌లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం- చిన్నారుల మరణాల ఘటనతో ప్రారంభించాలి.
ఎస్సే ప్రారంభంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఎగ్జామినర్‌ను ఆకట్టుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని అడుగు వేయాలి. మొదటి పేజీ పేరాల్లో సరళమైన పదాలు, సూటిగా, స్పష్టమైన వివరణలు ఉండేలా చూడాలి. ఇతరులతో పోల్చితే భిన్నంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉంటే ఎక్కువ మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
రాత తీరు.. ఉండాలిలా!
అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి.
వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి.
ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్లో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది. మీకు ఎంత సమయం అందుబాటులో ఉంటుందో మిగిలిన వారికీ అంతే ఉంటుందన్న విషయం గుర్తించి, నిర్దేశ సమయం, ముందుగా సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి.
పొంతనలేని కొటేషన్స్, సామెతలు లేకుండా చూడాలి. సందర్భాన్ని బట్టి అవసరమైనంతలో మంచి కొటేషన్స్, సామెతలు ఉపయోగించవచ్చు.
ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.
గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి.
బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్‌లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు సముచితంగా ఉపయోగించాలి.
వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్లైన్ చేయాలి. ఇలాంటివి పేజీలో రెండు లేదా మూడు అంశాలకు పరిమితం చేయాలి.
ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు.
రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు.
ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించేలా ఉండకూడదు.
వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి.
ఎస్సేకు ముగింపు రాసే ముందు అప్పటివరకు రాసిన భాగాన్ని మరోసారి చదవాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.
ఈ కింది ఉదాహరణ ద్వారా ఎస్సే పేపర్లో సమకాలీనతకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది.
Ex: In the context of Gandhiji's views on the matter, explore, on an evolutionary scale, the terms "Swadhinata', "Swaraj', and "Dharmarajya'. Critically comment on their contemporary relevance to Indian democracy. (2012 సివిల్స్ మెయిన్స్)
ఎస్సే పేపర్లో వచ్చే అవకాశమున్న కొన్ని అంశాలు:
ఉత్తరాఖండ్ వరద బీభత్సం.
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువలో అధిక క్షీణత.
నిర్భయపై సామూహిక అత్యాచారం కేసు- దోషులకు మరణ శిక్ష విధింపు.
ఆహార భద్రత చట్టం అమలు-సాధ్యాసాధ్యాలు.
దేశ ఆర్థికాభివృద్ధిపై అవినీతి కుంభకోణాల ప్రభావం.