guru sai datt
-
కరోనా బారిన కశ్యప్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. కశ్యప్‌తోపాటు భారత ఇతర షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్, ప్రణవ్ చోప్రాలకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ‘ఈ నలుగురు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఈ నలుగురిలో ఒకరికి కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. కశ్యప్, గురుసాయిదత్, ప్రణవ్, ప్రణయ్‌లకు పాజిటివ్ రాగా... కశ్యప్ భార్య, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు నెగెటివ్ వచ్చింది. కొన్నిసార్లు తొలి పరీక్షలో ఫాల్స్ పాజిటివ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులు వేచి చూశాక మళ్లీ పరీక్షకు హాజరు కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సోమవారం వీరందరూ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు’ అని పుల్లెల గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 25న వివాహం చేసుకున్న గురుసాయిదత్ ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోగా... మిగతా ఆటగాళ్లు గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. -
కొరియాను కొట్టేస్తాం!
గురుసాయిదత్ ధీమా న్యూఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణ కొరియా చేతిలో ఎదురైన ఓటమికి వారి దేశంలో బదులు తీర్చుకుంటామని భారత బ్యాడ్మింటన్ యువతార గురుసాయిదత్ తెలిపాడు. గత మే నెలలో న్యూఢిల్లీలో జరిగిన థామస్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కొరియా 3-2తో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమితో భారత్‌కు నాకౌట్ అవకాశాలు చేజారాయి. అయితే ఆసియా క్రీడల రూపంలో దక్షిణ కొరియాపై వారి గడ్డపైనే ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్‌కు లభించిందని... దీనిని సద్వినియోగం చేసుకుంటామని కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన ఈ హైదరాబాదీ షట్లర్ తెలిపాడు. ‘డబుల్స్‌లో కొరియా అత్యంత పటిష్టంగా ఉంది. వారిని ఓడించాలంటే మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో మేం తప్పనిసరిగా గెలవాలి. ఇది కష్టమే అయినప్పటికీ అసాధ్యం కాదు. ఇదే జరిగితే కొరియాను ఓడించగలుగుతాం’ అని రెండోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్న గురుసాయిదత్ వివరించాడు. కాస్త కష్టమే...: మరోవైపు కొరియాను కొరియాలో ఓడించడం కాస్త క్లిష్టమేనని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ‘ముందు పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. మేం బాగా రాణిస్తామనే నమ్మకంతో ఉన్నాను. ప్రత్యర్థిని బట్టి మా వ్యూహ, ప్రతివ్యూహాలు ఉంటాయి. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు గొప్పగా పతకాలు రాలేదు. అయితే ఇటీవల కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు పతకాలు నెగ్గారు. అవే ఫలితాలు ఆసియా క్రీడల్లో పునరావృతం అవుతాయని ఆశిస్తున్నాను’ అని గోపీచంద్ తెలిపాడు. టీమ్ ఈవెంట్స్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ తరఫున సింగిల్స్‌లో కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సౌరభ్ బరిలోకి దిగుతారు.